Saturday, November 15, 2025
Homeకెరీర్Study Tips : గెలుపు గోపురం.. చిన్న లక్ష్యాలే సోపానాలు!

Study Tips : గెలుపు గోపురం.. చిన్న లక్ష్యాలే సోపానాలు!

The importance of setting  goals for students  : విద్యా సంవత్సరం మొదలవగానే ‘ఈసారి ర్యాంకు కొట్టాలి’, ‘అన్ని సబ్జెక్టుల్లో 90% దాటించాలి’ అని పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. మనసులో ఆశయాల సౌధాలు నిర్మించుకుంటాం. కానీ, రోజులు గడిచేకొద్దీ ఆ ఉత్సాహం నీరుగారిపోతుంది. చివరికి పరీక్షల ముందు తలపట్టుకుని, అసంపూర్తిగా మిగిలిన సిలబస్‌ను చూసి ఆందోళన చెందుతాం. మరి, ఆకాశమంత లక్ష్యాన్ని అందుకోవాలంటే దానికి నిచ్చెన..? ఆ నిచ్చెన మెట్లే ‘చిన్న లక్ష్యాలు’ అంటున్నారు విద్యా నిపుణులు. కేవలం పెద్ద గమ్యం గురించి కలలు కంటే సరిపోదు, ఆ గమనాన్ని సులభతరం చేసే రోజువారీ చిన్న విజయాలే అసలైన విజయ రహస్యం. అసలు ఈ చిన్న లక్ష్యాల వ్యూహం విద్యార్థుల విజయాన్ని ఎలా శాసిస్తుంది..? రోజువారీ ప్రణాళికలు మన అంతిమ గమ్యాన్ని ఎలా సులభతరం చేస్తాయి..?

- Advertisement -

ప్రణాళికే పునాది – అమలుే ఆలంబన : వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలనేది మీ పెద్ద లక్ష్యం అనుకుందాం. ఆ గమ్యాన్ని చేరాలంటే, దానికి బలమైన పునాది కావాలి. ఆ పునాదే మీ ‘రోజువారీ ప్రణాళిక’.

ప్రణాళిక రచన: ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తూ ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.

కచ్చితమైన అమలు: ప్రణాళిక వేసుకోవడం ఎంత ముఖ్యమో, దానిని తూచా తప్పకుండా అమలు చేయడం అంతకంటే ముఖ్యం. ‘రేపు చదువుదాంలే’ అని వాయిదా వేస్తే, ఎంత గొప్ప ప్రణాళిక వేసుకున్నా అది కాగితానికే పరిమితమవుతుంది. రోజువారీ లక్ష్యాన్ని పూర్తిచేశాక వచ్చే సంతృప్తే, మరుసటి రోజుకు ప్రేరణగా నిలుస్తుంది.

వాయిదాలకు స్వస్తి – సమయానికి పస్తు : “ఏరోజు పాఠం ఆరోజే చదవాలి” – ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే అయినా, విజయానికి ఇదే అసలైన సూత్రం.

వాయిదా వద్దు: ‘సంవత్సరం ఇంకా చాలా ఉంది కదా’ అనే నిర్లక్ష్యం వద్దు. ఎప్పటికప్పుడు చెప్పిన పాఠాలను పూర్తి చేయడం, నోట్సును క్రమపద్ధతిలో పెట్టుకోవడం వంటివి చిన్న పనులే అయినా, ఇవి మీ పెద్ద లక్ష్యానికి పునాది రాళ్లు.

వ్యవస్థీకృత జీవనం: పుస్తకాలను, నోట్సును ఎక్కడికక్కడ సర్దిపెట్టుకోవడం ఒక మంచి అలవాటు. దీనివల్ల అనవసరమైన సమయం వృథా కాదు. ఉదాహరణకు, ఉదయాన్నే కాలేజీకి బయలుదేరేటప్పుడు నోట్స్ కనిపించకపోతే, దానికోసం వెతికే క్రమంలో బస్సును కోల్పోవచ్చు. ఫలితంగా, ఆ రోజు పాఠ్యాంశాన్ని నేరుగా వినే అవకాశాన్ని చేజార్చుకుంటారు. ఒక చిన్న నిర్లక్ష్యం, మీ పెద్ద లక్ష్యంపై ఎంత ప్రభావం చూపుతుందో ఇక్కడ గమనించాలి.

తరగతి గదిలోనే విజయం.. శ్రద్ధే ఆయుధం : పరీక్షల్లో విజయం సాధించాలంటే, ఆ విజయానికి పునాది పడేది తరగతి గదిలోనే. ఇక్కడ కొన్ని చిన్న లక్ష్యాలు మిమ్మల్ని అగ్రగామిగా నిలుపుతాయి.

సమయపాలన: రోజూ ఉదయాన్నే నిద్రలేవాలనేది ఒక చిన్న లక్ష్యం. కానీ ఇది మీరు సమయానికి కళాశాలకు చేరేలా చేస్తుంది.

ఏకాగ్రత: అధ్యాపకులు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినడం మరో ముఖ్యమైన లక్ష్యం. దీనివల్ల సగం సిలబస్ అక్కడే అర్థమైపోతుంది.

సందేహ నివృత్తి: సందేహాలు వస్తే, వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. ‘తర్వాత అడుగుదాంలే’ అని వాయిదా వేస్తే, ఆ సందేహం ఎప్పటికీ నివృత్తి కాదు.

మార్పును ఆహ్వానిద్దాం.. గెలుపును అందుకుందాం : కొత్త కళాశాలలో లేదా యూనివర్సిటీలో అడుగుపెట్టినప్పుడు, అక్కడి వాతావరణం, కొత్త స్నేహితులు, అధ్యాపకులు మొదట్లో ఇబ్బందిగా అనిపించవచ్చు. “కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి” అనే చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, మీరు మానసికంగా స్థిరపడతారు. ఈ మానసిక ప్రశాంతతే, చదువులో రాణించాలనే మీ పెద్ద లక్ష్యాన్ని సులువుగా చేరుకునేలా చేస్తుంది. మార్పును స్వాగతించగలిగితే, విజయం మిమ్మల్ని స్వాగతిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad