Exams Fear Reduce Tips: పరీక్షల సమయం దగ్గరపడుతుందంటే చాలు.. విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతుంది. అప్పటివరకూ ఏకాగ్రతతో చదివి మొదడులో ఎక్కించుకున్న జ్ఞానం అంతా ఎగ్జామ్స్‌లో పేపర్‌పై పెన్ను పెట్టగానే ఎగిరిపోతుంది. ఇక రాద్దామన్నా ఏం గుర్తు రాదు. కొందరిలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇందుకు కారణం ఒత్తిడి, ఆందోళన, తమపై తాము నమ్మకం పోల్పోవడం.. ఫలితంగా ఏకాగ్రత లోపించి పరీక్షల్లో సరిగా రాయలేకపోతారు. అప్పటి వరకూ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కేది ఈ పరీక్షల ద్వారానే.. అందుకే ఇలాంటి సమయాల్లో విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని కీలక సూచనలు పాటించాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.. వాటిని పాటిస్తే మీరు జీవితంలో ఉన్నత స్థానంలో ఎదగడానికి తొలి మెట్టు ఎక్కినట్లే..
కొందరు పరీక్షలకి వారం ముందుగానే ప్రిపరేషన్ అంతా పూర్తి చేసుకుని.. ఎగ్జామ్స్‌కి సన్నద్ధంగా ఉంటారు. ఆ వారం రోజులు జస్ట్ రివిజన్ చేసి మిగతా టైం రిలాక్సింగ్ ఆట, పాటలతో మైండ్‌ని ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. అయితే మరికొందరు పరీక్షకి ముందు రోజు రాత్రి వరకూ పుస్తకాలతో యుద్ధం చేస్తుంటారు. ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళితే ఈ హడావుడి అనేది ఉండదు.
టైమ్‌లైన్..
ముందుగా సబ్జెక్ట్‌కి సంబంధించి సిలబస్‌ని చిన్న పార్టులుగా విభజించుకోవాలి. ఒక్కో పార్టు ప్రిపరేషన్‌కి కొంత సమయం కేటాయించుకోవాలి. కష్టతరంగా ఉన్న సిలబస్‌కి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా త్వరగా ప్రిపరేషన్ పూర్తవుతుంది. దేనికైనా ఓ టైమ్‌లైన్ పెట్టుకోవడం ద్వారా ఆందోళన తగ్గి ఒత్తిడి లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఫలితంగా మీపై మీకు నమ్మకం ఏర్పడుతుంది.
మానసిక ప్రశాంతత
ప్రిపరేషన్ మధ్యలో కాసింత టైం మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి కేటాయించాలి. కొద్ది నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ ద్వారా చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెరగడానికి దోహదపడుతుంది. దీని ద్వారా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం తగ్గిపోతుంది. కేవలం కొద్ది నిమిషాల మెడిటేషన్.. మీలో మానసిక ప్రశాంతతను పెంచుతూ ప్రతీ చిన్న విషయానికి భావోద్వేగానికి గురికాకుండా ఉండేలా తోడ్పడుతుంది.
ఫిజికల్ ఫిట్‌నెస్
పరీక్షల ప్రిపరేషన్ సమయంలో మానసిక ప్రశాంతత ఎంత ముఖ్యమో ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా అంతే కీలకం. మంచి నిద్ర, పోషకాహారంతో పాటు రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. ఇలాంటి సమయాల్లో కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. చిన్నపాటి నడక, ఎక్సర్‌సైజులు.. మీ శరీరంతో పాటు మూడ్‌ని రిలాక్స్ చేస్తాయి. తద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు చివరి నిమిషంలో ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు.
యోగాతో రిలాక్సేషన్
ప్రతి విద్యార్థి జీవితంలో యోగా అనేది కీలక పాత్ర పోషిస్తుంది. టెన్షన్‌ని తగ్గించి, సరైన ఆలోచనలు తీసుకునేందుకు యోగా దోహదపడుతుంది. యోగాతో పాటు క్లాసికల్ మ్యూజిక్‌ను అలవరుచుకుంటే.. మైండ్‌ని ప్రశాంతంగా ఉంచడంతో పాటు మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. క్రికెట్ దిగ్గజం ధోనీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా పీస్‌ఫుల్‌గా ఉండటానికి కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక్క రాత్రిలోనే రాదు
ఏ విద్యార్థికైనా విశ్వాసం అనేది ఒక్క రాత్రికే రాదు. హార్ట్ వర్క్, నిరంతర కృషి కారణంగా ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. మెయిన్ ఎగ్జామ్స్ కంటే ముందు మాక్ టెస్టులు, టైం బేస్‌డ్ టెస్టులు రాస్తూ మీరు వాటిలో చేసిన పొరపాట్లను తెలుసుకోవడం ద్వారా ఎక్కడ తప్పు చేస్తున్నారనేది తెలుసుకోవచ్చు. ఫలితంగా ప్రధాన పరీక్షల్లో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. వీటితో పాటు సానుకూల ఆలోచనలు కూడా మీ పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిస్తాయని గమనించాలి.
పోలిక వద్దు
ప్రిపరేషన్ సమయంలో ఎవరికి వారే ప్రత్యేకమని గమనించుకోవాలి. వేరే వాళ్లతో పోల్చుకుంటూ మీ టాలెంట్‌ను తక్కువ చేసుకోకండి. రోజంతా పుస్తకాలతోనే కుస్తీ పట్టకుండా అప్పుడప్పుడూ స్వల్ప విరామం తీసుకుంటూ మైండ్‌ని రిలాక్స్ చేసుకుంటే ఉత్తమం. ఎప్పుడైనా ఒత్తిడికి లోనైనప్పుడు కాసేపు తల్లిదండ్రులు, టీచర్, కౌన్సిలర్ లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ మీ ఆలోచనలను పంచుకోండి. తద్వారా ఒక విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు.. ఇతరులు ఎలా చూస్తున్నారు అనేది అర్థమవుతుంది.
సమయాన్ని సరిగ్గా వాడుకోండి
ప్రిపరేషన్ సమయంలో నిత్యం వీటిని పాటించడం ద్వారా పరీక్షలు మొదలయ్యే నాటికి మీలోని మార్పులను గమనిస్తారు. ఇక ఎగ్జామ్స్ రాసేటప్పుడు సమయాన్ని తెలివిగా వాడుకుంటూ.. ప్రతి జవాబుకి నిర్దిష్ట సమయం కేటాయించుకోవడం ద్వారా ఏ ప్రశ్నని వదిలిపెట్టకుండా ఉండగలరు. తద్వారా లాస్ట్ మినిట్‌లో తొందరపాటు ఉండదు. ఫలితంగా మీరు ఉత్తమ ఫలితాలు సాధించి మీ లక్ష్యాన్ని చేరువగలరు. ఈ సూచనలు కేవలం విద్యార్థులకే కాదు.. పోటీ పరీక్షలకి సన్నద్ధమైన అభ్యర్థులకి సైతం చాలా అవసరమని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

