Tech Mahindra: సుమారు 30,000 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ (Layoffs) వేటు పడనుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను టెక్ మహీంద్రా ఖండించింది. ఇవన్నీ కేవలం అసత్య ప్రచారాలని పేర్కొంది. అలాంటి ఆలోచనేదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది.
అసత్య ప్రచారాలను నమ్మవద్దు: సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల వల్ల ఉద్యోగులు, వాటాదారులలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరణ ఇచ్చింది. ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగించే ఎటువంటి ప్రతిపాదన ప్రస్తుతం యాజమాన్యం పరిశీలనలో లేదు. లిస్టెడ్ కంపెనీగా తాము అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. నిరాధారమైన వార్తలను నమ్మవద్దని కోరింది.
వదంతులకు చెక్!: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న నేపథ్యంలో టెక్ మహీంద్రా గురించి వచ్చిన ఈ వార్త సంచలనంగా మారింది. అయితే సంస్థ అధికారికంగా స్పందించడంతో ఈ వదంతులకు తెరపడింది. కంపెనీ తన కార్యకలాపాల స్థిరత్వంపై పూర్తి నమ్మకంతో ఉందని వెల్లడించింది.

