US Visa Delay 2025: అమెరికాలో వలసదారులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. వారి వీసా దరఖాస్తులను అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల సంస్థ (USCIS) పరిశీలించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1.13 కోట్ల వీసా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి. వీసా ప్రక్రియలో నెలలు, సంవత్సరాల తరబడి జాప్యం జరగడం అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేస్తోంది. వీసాలు, పని అనుమతులు, రెసిడెంట్ కార్డుల వంటి అవసరాలకు వేచి చూసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ట్రంప్ పాలన ఎఫెక్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అధికారంలోకి వచ్చాక వలస చట్టాలు కఠినతరం అయ్యాయి. వీసా అభ్యర్థులపై నిఘా పెరగడంతో అధికారుల పనులు ఆలస్యమవుతున్నాయి. ట్రంప్ పాలనలో USCIS పనులు నత్తనడకన సాగుతున్నాయి. న్యాయవాది చార్లెస్ కుక్ వెల్లడించిన ప్రకారం, గత ప్రభుత్వం USCISను మితిమీరి విచారణలు జరపమని ఆదేశించడంతో వ్యవస్థలో బ్యాక్‌లాగ్ ఏర్పడడం ప్రారంభమైంది. ఇప్పుడు అది అపారమైన కేసుల పేరుతో ముందుకు సాగుతోంది. ప్రత్యేకించి Form I-90 (పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్) మరియు Form I-765 (పని అనుమతుల కోసం) వీసాల ప్రాసెసింగ్ టైమ్స్ గత త్రైమాసికం కంటే పెరిగాయి.
అంతేకాక, ముందుగా వేగవంతంగా పని చేసిన స్ట్రీమ్.లైన్డ్ కేసు ప్రాసెసింగ్ (SCP) వ్యవస్థను నిలిపివేయడంతో పనితీరు మరింత మందగించింది. ఈ SCP ఒక ఆటోమేటెడ్ విధానం, అధికారి సమీక్ష లేకుండా నిర్దిష్ట అప్లికేషన్లను వేగంగా ఆమోదించే విధంగా ఉండేది. అయితే సీసీల పరిశీలనకు మరింత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో SCPను తాత్కాలికంగా నిలిపివేశారు. పునరుద్ధరణపై మాత్రం గడువు పేర్కొనలేదు.
కొన్ని కేటగిరీలలో మాత్రం వేగంగా..
వీసా ఆలస్యాలన్నీ ఒకేలా ఉండటం లేదు. కొన్ని కేటగిరీలలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ఉదాహరణకు, Form I-131 (అడ్వాన్స్ పారోల్ అప్లికేషన్) కేసుల బ్యాక్‌లాగ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 60,000 కేసులు తగ్గింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. దాదాపు 2.6 లక్షల కేసులు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయి. ఇది ఎంతో ఆందోళన కల్గించే విషయం.
హోంలాండ్ సెక్యూరిటీకి చెందిన మాజీ అధికారి మోర్గాన్ బెలీ మాట్లాడుతూ, బ్యాక్‌లాగ్ అన్నదీ కొన్ని సందర్భాల్లో విధానపరమైన నిర్ణయమే అవుతుంది. స్టాఫ్ తగ్గడం, కొత్త పాలసీ మార్గదర్శకాలు, లేదా కోర్టు కేసుల కారణంగా కూడా వీసా ప్రాసెసింగ్‌లో మార్పులు వస్తుంటాయని పేర్కొన్నారు.
ఈ ఆలస్యాల ప్రభావం ముఖ్యంగా విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులు, గ్రీన్ కార్డ్ ఆశావహులపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. USCIS తన వనరులను విస్తరించి, సాంకేతికతను పునరుద్ధరించి, వ్యవస్థను మళ్లీ సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది.


