Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభNandi Awards: సిఫార్సులకు నో ఛాన్స్, 27 మంది జడ్జిలే ఫైనల్

Nandi Awards: సిఫార్సులకు నో ఛాన్స్, 27 మంది జడ్జిలే ఫైనల్

గుంటూరులో కనుల విందుగా 'నందుల' పండుగ

తెలుగు నాటకానికి పండుగ రోజైన నంది నాటకోత్సవాలను డిసెంబర్ 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి. వి-నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మొదటి అంతస్తులోని ఆర్టీసీ కాన్పరెన్స్ హాల్ లో నంది అవార్డుల తుది పోటీల న్యాయనిర్ణేతల సమక్షంలో “22వ నంది నాటకోత్సవం -2022” కు సంబంధించిన వివరాలను పోసాని కృష్ణమురళి మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు నాటక రంగ విస్తరణకు ఎనలేని ప్రోత్సాహం అందించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నందినాటకోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ ప్రాంగణానికి సత్య హరిశ్చంద్ర నాటక రచయిత, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, రంగస్థల, సినిమా నటులైన బలిజేపల్లి లక్ష్మీకాంతం పేరును నామకరణం చేసినట్లు చెప్పారు. నంది నాటకోత్సవాల్లో భాగంగా 115 ప్రదర్శనలకు గానూ రాష్ట్రం నలుమూలల నుండి పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, బాలల నాటిక, కళాశాల లేదా యూనివర్సిటీ నాటిక (ప్లేలెట్స్) అనే ఐదు విభాగాల్లో ఎంపిక చేసిన 38 నాటక సమాజాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. ఆయా విభాగాల్లో కలిపి మొత్తం 74 అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

పూర్తి పారదర్శకంగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. తెలుగు నాటక రంగం దేదీప్యమానంగా వెలగాలని, రంగ స్థలానికి పునర్వైభవం తీసుకురావాలన్న సత్సంకల్పంతో నంది నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఎంట్రీల ప్రాథమిక ఎంపిక ఈ ఏడాది సెప్టెంబర్ 6-18 మధ్య జరగిందని, ఫలితాలను సంస్థ 19న వెల్లడించిందని పేర్కొన్నారు.

మూడు న్యాయనిర్ణేతల బృందాలు పోటీల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చిన నాటక సమాజాల వద్దకు వెళ్లి వాళ్ల ప్రదర్శనలు తిలకించి ఎంపిక చేశాయన్నారు. వీటిలో పద్యనాటకాలలో 26కు గాను 10, సాంఘిక నాటకాలలో 22 కు గాను 6, సాంఘిక నాటికలలో 49 కు గాను 12, కాలేజీ యూనివర్సిటీ స్థాయిలో 9 కు గాను 5, బాలల విభాగాలలో 9 కు గాను 5 ఎంపిక చేశామన్నారు.

వారం రోజుల పోటీల్లో తుది ఎంపిక కోసం సంబంధిత సమాజాలు సంస్థ చైర్మన్ సమక్షంలో జరిగిన ‘లాటరీ’లో పాల్గొన్న అనంతరం ప్రదర్శనల ‘షెడ్యూలు’ను సంస్థ ఖరారు చేసిందన్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుండి రాత్రి 10 గంటల వరకు నాటక ప్రదర్శనలు జరుగుతాయని పోసాని తెలిపారు. 5 విభాగాలలో స్వర్ణ, రజత, కాంస్య నంది బహుమతుల కోసం జరిగే పోటీల్లో ఒక్కోదానిలో ముగ్గురు చొప్పున మొత్తం 15 మంది న్యాయనిర్ణేతలు ఈ తుది ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేస్తారని పోసాని తెలిపారు. అవార్డులు ప్రదానం చేస్తున్న ఏడాదిలో (2022) నాటక రంగంపై వెలువడిన ఉత్తమ రచన గ్రంథం ఎంపిక కోసం మరో ముగ్గురితో మరో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పోసాని కృష్ణ మురళి తెలిపారు. 18 మంది ఉత్తమ నిపుణులు, కళాకారులను జడ్జిలుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. న్యాయ నిర్ణేతల ఎంపికలో లోపాలను ఎత్తిచూపిస్తే వారిని కూడా మారుస్తామని పోసాని తెలిపారు.

ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం మరియు, డా. వై. ఎస్.ఆర్ రంగస్థల పురస్కారం. ఎంట్రీలకు 20 వరకు పొడిగింపు. ప్రభుత్వం 1998 నుంచి నంది నాటకోత్సవాల వేదికపై ‘ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం’ పేరుతో నాటకరంగంలో వ్యక్తిగత స్థాయిలో విశేష కృషి చేసిన నటులకు, కళాకారులకు రూ.1,50,000 నగదు ప్రదానం చేస్తోందని పోసాని కృష్ణ మురళి తెలిపారు. ప్రస్తుతం మొదటిసారి ఈ రంగంలో సమిష్టి కృషితో (టీమ్ వర్క్) పనిచేసిన సమాజాలకు, పరిషత్తులకు ఈ అవార్డుతో గుర్తింపు లభించనుందని వెల్లడించారు. నాటక రంగంపై ఆసక్తిగల కళాప్రియులకు వేదిక కల్పించి, ఆ రంగం వృద్ధికి గణనీయమైన కృషి చేసిన నాటక సమాజాలు, పరిషత్తులకు రూ.5,00,000 నగదు, ‘వైఎస్సార్’ ప్రతిమ మొమెంటోతో సత్కరిస్తూ నాటక సమాజాలకు ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించనుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు.

డిసెంబర్ 20 వరకూ గడువు పొడగింపు..

రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ రంగంలో మొత్తం 27 మంది నిపుణులు న్యాయ నిర్ణేతలుగా ఈ ఏడాది నంది నాటకాల ప్రాథమిక, తుది ఎంపిక కోసం పనిచేస్తున్నారన్నారు. వారికే ఈ రెండు అవార్డులు కోసం వచ్చిన ఎంట్రీల నుంచి అర్హులను ఎంపికచేసే బాధ్యతను కూడా అప్పగించామన్నారు. ‘ఎన్టీఆర్’, ‘డా. వై.ఎస్.ఆర్’. అవార్డుల ఎంట్రీలకు తుది గడువు డిసెంబర్ 20 వరకు పొడిగించిన నేపథ్యంలో ఇంకా ఎవరైనా కళాకారులు దరఖాస్తు చేసుకోకపోతే ఎఫ్ డీసీకి మెయిల్ ద్వారా సంబంధిత గడువులోగా దరఖాస్తులు పంపాలన్నారు. బాలల, కళాశాల విద్యార్థి నాటకాల విభాగాల్లో వ్యక్తిగత బహుమతులను వచ్చే సంవత్సరం నుండి అందించే అంశాన్ని సంస్థ పరిశీలిస్తుందని పోసాని కృష్ణమురళి తెలిపారు.

నాటక రంగంలోకి యువత వచ్చేలా..

ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ మరియు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆదరణ తగ్గుతున్న నాటక రంగానికి పూర్వ వైభవం లభిస్తుందన్న కళాభిలాషుల ఆకాంక్ష నెరవేరనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నాటక రంగంలోకి కొత్తగా యువతరం ప్రవేశించే అవకాశం మెండుగా ఉందన్నారు. పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని, అవార్డుల ఎంపికకు అనుభవజ్ఞులైన ప్రముఖ నాటక రంగం వ్యక్తులతో వివిధ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. స్థానిక కళాకారులు, అధికారులతో నిర్వహణ కమిటీ, ఆహ్వాన కమిటీ, స్టేజీ కమిటీ, ఆడిటోరియం కమిటీ, ఆతిథ్య కమిటీ, వసతి సదుపాయాలు మరియు రవాణా కమిటీ, ప్రెస్ సమన్వయ కమిటీ తదితర కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. నంది నాటకోత్సవంలో పాల్గొనే కళాకారులకు సంబంధించిన భోజన, వసతి, రవాణా ఏర్పాట్లు, వారి కార్యక్రమ షెడ్యూల్ ను తెలిపే అంశాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నంది నాటకోత్సవాల కార్యక్రమ వేడుకను ఘనంగా నిర్వహిస్తామన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వరంలో స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.

మీడియా సమావేశంలో రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎంవీఎల్ఎన్ శేషసాయి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News