‘ఫన్ మోజీ’ అంటూ యూట్యూబ్‌లో అందరినీ నవ్వించే టీం ఇకపై సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అయింది. మన్వంతర మోషన్ పిక్ఛర్స్ మీద కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతోన్నారు. అంతే కాకుండా డెమీ గాడ్ క్రియేటివ్స్ అంటూ వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా ప్రారంభించనున్నారు. మన్వంతర మోషన్ పిక్చర్స్ అనే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ లో ఆల్రెడీ ఓ సినిమాను ప్రారంభించినట్టుగా టీం తెలిపింది. ఈ క్రమంలో ఫన్ మోజీ టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో నిర్వహకులు సుశాంత్ మహాన్, హరీష్, సంతోష్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ మీడియాతో ముచ్చటించారు.
సుశాంత్ మహాన్ మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో మా ఫన్ మోజీకి మిలియన్ల సబ్ స్క్రైబర్లు, బిలియన్ల వ్యూస్ వచ్చాయి. మా అందరినీ ఎంతగానో ఆదరించారు. ఇక ఇప్పుడు మేం సినిమా ప్రొడక్షన్లోకి కూడా రాబోతోన్నాం. దాంతో పాటుగా వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా లాంచ్ చేయబోతోన్నాం. ఆల్రెడీ మా వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా కోసం పని చేస్తోంది. మేం ముగ్గురిగా ప్రారంభించిన ఈ సంస్థలో ఇప్పుడు 40 మందికి పైగా ఉన్నాం.
యూట్యూబ్‌లో మా అందరినీ ఆదరించినట్టుగానే సినిమాల్లోనూ మా అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. వీఎఫ్ఎక్స్ విషయంలో మన టాలీవుడ్ స్టాండర్డ్స్‌ని పెంచాలని అనుకుంటున్నాం. మున్ముందు ఇతర సంస్థలతోనూ కలిసి పని చేయాలని అనుకుంటున్నామ’ అని అన్నారు.