Sai Srinivas- Kavya Engagement: సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కి చెందిన కావ్య రెడ్డితో శ్రీనివాస్‌కి ఈ రోజు నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త మీనన్ హాజరయ్యారు.
బ్యాచ్‌లర్ జీవితానికి ముగింపు పలుకుతూ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మేరకు ఆదివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య కావ్య రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. కావ్య హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన యువతిగా తెలుస్తోంది. ఆమె తాతయ్య జడ్జిగా, తండ్రి లాయర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
సాయి శ్రీనివాస్- కావ్యల ఎంగేజ్‌మెంట్ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్తా మీనన్ హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు, దర్శకనిర్మాతలు కూడా ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయమైన శ్రీనివాస్.. ‘రాక్షసుడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి తేదీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

