తెలంగాణలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) తెలిపారు. తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా పర్యాటకులను ఆహ్వానిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను తెలంగాణ టూరిజం శాఖ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
నాగార్జున మాటల్లోనే..
“అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం అందంగా ఉంటాయి. ఇక ఆలయాల విషయానికొస్తే, వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ప్రతి ఒక్కరూ చూడాలి. నిజంగా ఎంతో అందమైనదే కాదు, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. యాదగిరిగుట్ట చాలా సార్లు వెళ్లాను. తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్.. స్నాక్స్ విషయానికొస్తే సర్వపిండి చాలా ఇష్టం. ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్, హైదరాబాద్ బిర్యానీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇవన్నీ మర్చిపోలేను. మీతో చెబుతుంటే నా నోరూరుతోంది. ప్రజల ఆదరణ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తారు. మీరందరూ రండి. తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించండి.” అని తెలిపారు.