ప్రముఖ తమిళ, తెలుగు సీనియర్ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ఆయన.. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న భార్య రాధిక, కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా.. శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. శరత్ కుమార్ ఆస్పత్రి పాలయ్యారని తెలిసి.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
కాగా.. డిసెంబర్ 2020లో శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయన కరోనా బారిన పడినట్లు అప్పట్లో రాధిక, వరలక్ష్మీ సోషల్ మీడియాల్లో పోస్టులు చేశారు. తెలుగులో కాంచన, భరత్ అనే నేను, జయ జానకి నాయక సినిమాల్లో శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.