Actor Siddharth: తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో వరుసగా బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు సిద్ధార్థ్. ప్రేమకథా చిత్రాలతో లవర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా ఆ తర్వాత సిద్ధార్థ్ డౌన్‌ఫాల్ స్టార్టయ్యింది. హిట్టు అనే మాట విని సిద్ధార్థ్ చాలా కాలమైంది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు చేస్తున్నాడు సిద్ధార్థ్.
పరాయివాడిని చేశారు…
సిద్ధార్థ్ హీరోగా నటించిన 3బీహెచ్‌కే మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన తెలుగు కెరీర్‌పై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిట్ తర్వాత ఏడేళ్లు టాలీవుడ్‌లోనే సినిమాలు చేశానని సిద్ధార్థ్ అన్నాడు. తెలుగు తప్ప మరో భాషలో సినిమాను అంగీకరించదని చెప్పాడు. అన్ని ఏళ్లు సిటీని వదిలిపెట్టకుండా హైదరాబాద్‌లోనే ఉన్నానని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. ఒకటి రెండు ఫ్లాప్‌లు రాగానే తెలుగు వాళ్లు నన్ను పరాయివాడిని చేశారు అని సిద్ధార్థ్ చెప్పాడు. కానీ ఏ రోజు ఎవరితో గొడవలు పెట్టుకోలేదని, ఒక స్టేజ్ తర్వాత నా మనసుకు నచ్చిన కథలు రాకపోవడం, నాతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేశానని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.
హీరో అంటే నమ్మలేదు…
రంగ్‌దే బసంతీ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి సిద్ధార్థ్ బయటపెట్టారు. రంగ్‌దే బసంతీ ప్రీమియర్ చూడటానికి ముంబైలోని ఓ థియేటర్‌కు వెళితే పాస్ లేదని సెక్యూరిటీ వాళ్లు తనను లోపలికి పంపించలేదని అన్నారు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెబితే కథలు చెప్పొద్దు అంటూ తన మాటలు నమ్మలేదని సిద్ధార్థ్ చెప్పాడు. చివరకు ఆమిర్‌ఖాన్ వచ్చి తనను థియేటర్ లోపలికి తీసుకెళ్లారని అన్నాడు.
అదితీ దొరికింది…
అదితీరావ్ హైదరీతో పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సిద్ధార్థ్. పెళ్లికి ముందు నా గురించి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు నేను కిందపడితే దెబ్బతగలకుండా పట్టుకోవడానికి అదితీరూపంలో ఓ మంచి తోడు దొరికిందని సిద్ధార్ అన్నాడు. నా గురించి ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని ఓ మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చిందని చెప్పాడు.