సినీ నటి, బీజేపీ మహిళా నేత మాధవీలత(Madhavi Latha) బోరున ఏడ్చేశారు. తన ఆత్మగౌరవంపై దాడి జరిగిందంటూ ఆమె ఏడుస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆడపిల్లగా సింపథీ గేమ్ ఆడకుండా మగాడిలా పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. తాను ఎవరికీ ద్రోహం చేయకపోయినా కక్షగట్టి మాటలు అంటున్నారని వాపోయారు. తనను నోటికి వచ్చింది తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అని ఆమె ప్రశ్నించారు.
“నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడితో నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం… అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. నా పార్టీ కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు. ఎవరికి ద్రోహం చేసింది లేదు. మోసం చేసింది లేదు. కానీ కక్షగట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎపుడు నేను సింపథీ గేమ్ ఆడలేదు. మహిళ అనుకూల చట్టాలను ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. మీ ప్రేమ అభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి” అంటూ తెలిపారు.
కాగా మాధవీలతపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన మాటలకు చింతిస్తూ మాధవీలతకు జేసీ క్షమాపణలు చెప్పారు.