Akshay Kumar : సైబర్ నేరగాళ్లు (Cyber Crime) రెచ్చిపోతున్నారు. కొత్త తరహా ఆన్‌లైన్ ట్రాపింగ్‌లను అమలు చేస్తున్నారు. ఆర్థిక మోసాలే కాదు.. బ్లాక్ మెయిల్ చేయటానికి కూడా వెనుకాడటం లేదు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఇలాంటి సైబర్ నేరగాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కుమార్తెకు కూడా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు..స్వయానా అక్షయ్‌కుమార్. ఇంతకీ ఈ విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించారంటే సైబర్ క్రైమ్ గురించి చిన్న పిల్లలతో సహా అందరూ తెలుసుకోవాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. ముంబైలో పోలీస్ (Mumbai Police) ప్రధాన కార్యాలయంలో ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’(Cyber Awareness Month 2025) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కూడా హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న అక్షయ్ కుమార్ తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందికరమైన సైబర్ క్రైమ్ ఘటనను వివరించారు. ‘కొన్ని నెలలు ముందు 13 ఏళ్ల మా అమ్మాయి ఆన్‌లైన్‌లో గేమ్ (Online Game) ఆడుతోంది. అందులో గేమ్ ఆడుతున్న ఎదుటి వ్యక్తి చాలా మంచిగా మాటలు కలిపాడు. బాగా ఆడుతున్నావ్ అంటూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నువ్వు మేల్..ఫిమేలా? అని ప్రశ్నించాడు. తను ఫిమేల్ అనగానే నీ న్యూడ్ ఫొటోలు పంపు అంటూ బెదిరింపుగా అడిగాడు. వెంటనే మా అమ్మాయి గేమ్‌ను ఆఫ్ చేసేసి నా భార్యకు చెప్పింది. ఇలాగే సైబర్ క్రైమ్ అనేది ప్రారంభం అవుతుంది. ఏడవ తరగతి నుంచే చిన్న పిల్లలకు సైబర్ క్రైమ్ గురించి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి పాఠశాలతో ఓ గంట సైబర్ క్లాస్‌ను నిర్వహిస్తే బావుంటుంది. మారుతున్న డిజిటల్ కాలానికి తగ్గట్లు పిల్లలకు దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది’ అని అక్షయ్ కుమార్ తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే నార్త్‌లో బిజియెస్ట్ స్టార్ అయిన అక్షయ్‌కుమార్ (Akshay Kumar) ఇప్పుడు సౌత్ సినిమాలు కూడా చేయటానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. రజినీకాంత్ 2.0 మూవీలో విలన్ పాత్రలో మెప్పించిన ఈ బాలీవుడ్ స్టార్ ఈ ఏడాది తెలుగులో మంచు విష్ణు (Vishnu Manchu) నటించిన కన్నప్ప (Kannappa) చిత్రంలో పరమేశ్వరుడి పాత్రలో కనిపించారు. ఇక బాలీవుడ్‌లో బూత్ బంగ్లా సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు హైవాన్ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు అక్షయ్.


