Thursday, January 22, 2026
HomeTop StoriesAllu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వచ్చేసింది!

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వచ్చేసింది!

Allu Arjun Fans Association: ఇంతవరకు చెల్లాచెదురుగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు తొలిసారిగా ఒక ఆర్గనైజ్డ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. “అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోషియేషన్” అంటూ పేరుపెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆధ్రప్రదేశ్ శాఖకు కూనపురెడ్డి శివశంకర రావు, తెలంగాణ శాఖకు తమ్మనవేని అంజి యాదవ్‌ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. రెండు శాఖల్లోనూ ముగ్గురు ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులు, ఐదుగురు సంయుక్త కార్యదర్శులను ఎన్నుకున్నారు.

- Advertisement -

నిజానికి అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 1న తమ అసోసియేషన్‌ను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించామని, చిహ్నాన్ని కూడా ప్రకటించింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇప్పుడు రెండు శాఖల బాధ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఇప్పుడే ఈ అసోసియేషన్‌ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు? అనే ప్రశ్న తలెత్తుతోంది. చాలామందైతే ఇప్పటివరకూ అల్లు అర్జున్‌కు రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ లేదా? అని అశ్చర్యపోతున్నారు కూడా.

ఒకప్పుడు అల్లు అర్జున్‌ని కూడా మెగా ఫ్యాన్స్ తమ హీరోగానే భావించేవాళ్లు. కానీ రామ్ చరణ్ హీరోగా రంగప్రవేశం చేసిన కొన్నాళ్లకు పరిస్థితి మారిపోయింది. అల్లు అర్జున్ ఎదిగేకొద్దీ మెగా ఫ్యాన్స్ అతనికి దూరమవుతూ వచ్చారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఒక ఈవెంట్‌లో అందరికీ అభిమానులుంటారు కానీ తనకు అల్లు ఆర్మీ ఉందని స్వయంగా అల్లు అర్జున్ ప్రకటించడంతో అధికారికంగానే మెగా ఫ్యాన్స్ తన ఫ్యాన్స్ కాదని ఆయన తేల్చేశాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అప్పట్నించీ మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీ వేరుపడిపోయారు. ఒకరి హీరోని మరొకరు బీభత్సంగా ట్రోల్ చేయసుకోవడం మొదలుపెట్టారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అయితే మెగా ఫ్యాన్స్‌కు మరింత టార్గెట్ అయ్యాడు బన్నీ. ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యుడ్ని చేస్తూ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడంతో అనార్గనైజ్డ్‌గా ఉన్న అల్లు ఆర్మీకి ఏం చేయాలో పాలుపోలేదు. అదే ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఆర్గనైజ్డ్‌గా ఏర్పడి ఉన్నట్లయితే దాని ఆధ్వర్యంలో అభిమానులు ఆందోళనలకు దిగి ఉండేవారనే అభిప్రాయం వినిపించింది.

ఆ ఘటన తర్వాత నుంచే అల్లు ఆర్మీ ఆర్గనైజ్డ్ అసోసియేషన్ ఏర్పాటును సీరియస్‌గా తీసుకుందనీ, ఇప్పటికి అది ఆచరణ రూపం ధరించిందనీ తెలుస్తోంది. ఇటీవల తమ హీరోను అభిమానులు కలిసి అసోసియేషన్ ఏర్పాటు గురించి తెలియజేశారనీ, దీనికి బన్నీ కూడా అంగీకారం తెలిపారనీ అంతర్గత వర్గాల సమాచారం. రానున్న రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో తెలియనున్నది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News