హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. రూ.50వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవలే వాదనలు ముగియగా.. తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.
కాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తెలంగాణ హైకోర్టు(TG HighCourt) నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈనెల 27న రిమాండ్ ముగియడంతో అదే రోజు బన్నీ వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.