‘పుష్ప’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా స్టార్ డమ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రాజకీయాల్లో ఎంట్రీ(Political Entry) ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore)తో అల్లు అర్జున్, బన్నీవాసు, ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు భేటీ అయినట్లు టాక్ నడస్తోంది. పదేళ్ల పాటు బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాలని పీకే సలహా ఇచ్చినట్లు ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ వార్తలపై బన్నీ టీమ్ స్పందించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
‘అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు రూమర్స్ మాత్రమే. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎవరూ ప్రచారం చేయకండి. మేము ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా ఉండాలని మీడియా సంస్థలు, ప్రజలను అభ్యర్థిస్తున్నాం. అల్లు అర్జున్ నుంచి ఖచ్చితమైన అప్‌డేట్‌ల కోసం ఆయన టీమ్ నుంచి మాత్రమే అధికారిక ప్రకటనలు వస్తాయి’ అని ప్రకటనలో పేర్కొంది.