AP Film Chamber: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షునిగా మరోసారి అంబటి మధుమోహన్ కృష్ణ ఎన్నికయ్యారు. ఫిల్మ్ చాంబర్ నూతన కార్యవర్గ ఎన్నికలు మార్చి 29వ తేదీ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అంబటి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వీస్ విజయ్ వర్మ పాకలపాటి, ఎ. లోహిత్ కుమార్, సిహెచ్. లక్ష్మీ నరసింహం ఎంపికవగా, కార్యదర్శిగా జె.వి. మోహన్ గౌడ్ ఎంపికయ్యారు.
నూతన కార్యవర్గం ఇదే
ఇక సంయుక్త కార్యదర్శులుగా పి.డి.ఆర్. ప్రసాద్ రెడ్డి, ఆర్.వి.యన్. వరప్రసాద్, యన్.యస్. మూర్తి, కోశాధికారిగా కె. రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా యం. శ్రీనాథరావు, పి. రమణారెడ్డి, ఉప్పాల వెంకట్రావు, డి. ప్రభాకర్ రావు, సిహెచ్.ఆర్.జె. రామచంద్రరావు, యం.ఎస్. చౌదరి, పి.వి. రమణమూర్తి, అనగాని శ్రీనివాసరావు, బాందేపురపు మూర్తి, డి. రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ ఆశించినంత అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు పరిశీలించామని, వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.
విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తమ ప్రతి ఆలోచన, ప్రతి అడుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ సినిమాకు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్‌లా మారనుందని, ఈ నేపథ్యంలో ఇక్కడ సాంకేతిక నిపుణులు, సినీ వర్కర్స్‌కి అనూహ్యమైన భవిష్యత్ ఉందని, ఈ అవకాశాలని స్థానిక యువత అందిపుచ్చుకోవాలని ప్రధాన కార్యదర్శి జేవీ మోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి పిలుపునిచ్చారు.

