Friday, December 12, 2025
Homeచిత్ర ప్రభRam Pothineni: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ రివ్యూ

Ram Pothineni: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

Andhra King Taluka Review: రామ్ పోతినేని ఒక సినిమా స్టార్ అభిమానిగా సినిమా చేస్తున్నాడనే వార్త తెలిసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక కొత్త హీరో చేయాల్సిన పాత్రను అతను చేస్తున్నాడేమోనని వాళ్లు భావించారు. మరి.. ఆంధ్ర కింగ్ అనే సినిమా స్టార్‌గా ఉపేంద్ర నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఎలా ఉందంటే…

- Advertisement -

కథ
స్టార్ హీరో, ఆంధ్ర కింగ్ అని అభిమానులు పిలుచుకునే సూర్య (ఉపేంద్ర) నటించే వందవ సినిమాకి ఆర్థిక కష్టాలు వస్తాయి. సినిమాని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లెవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని తియ్యడం తనవల్ల కాదని నిర్మాత చేతులెత్తేస్తాడు. దాంతో సూర్యకు దిక్కు తోచదు. సినిమా పూర్తి చెయ్యాలంటే రూ. 3 కోట్లన్నా అవసరం. ఆ డబ్బివ్వడానికి ఇండస్ట్రీలో ఎవరూ ముందుకురారు. చివరకు సూర్యతో అదివరకు పది సినిమాలు చేసి లాభాలు గడించిన ఒక బడా నిర్మాత తన కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాలో తండ్రి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటే రూ. 3 కోట్లిస్తానంటాడు. సూర్య తలకొట్టేసినంత పనవుతుంది. ఇక ఏ దారీ తెలీక ఆ ప్రపోజల్‌కు ఒప్పుకోవాలని అనుకునేంతలో ఆయన బ్యాక్ అకౌంట్‌లో రూ. 3 కోట్లు జమ అయ్యాయనీ, ఆ డబ్బు వేసింది తన అభిమాని సాగర్ (రామ్) అనీ తెలుస్తుంది సూర్యకు. అప్పటిదాకా తను చూడని ఆ అభిమానిని ఎలాగైనా కలవాలని సూర్య వెళ్లినప్పుడు సాగర్ కథ మొదలవుతుంది. చిన్నప్పట్నించీ సూర్యను విపరీతంగా అభిమానిస్తూ వచ్చిన సాగర్, అక్కడి సినిమా థియేటర్ యజమాని కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) ప్రేమలో పడటమే కాకుండా, ఆమె ప్రేమనూ పొందుతాడు. కానీ ఆస్తి అంతస్తుల పరంగా, కులపరంగా తమకు ఏమాత్రం సరితూగని, థియేటర్ ముందు బ్లాకులో టికెట్లు అమ్ముకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాని నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా అని మహాలక్ష్మి తండ్రి (మురళీ శర్మ) అవమానించడంతో, సాగర్ ఆయనతో ఏం ఛాలెంజ్ చేశాడు? ప్రియురాలు కావాలా, లేక తన అభిమాన హీరో కావాలా అనే పరిస్థితి తలెత్తినప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? అనే విషయాల్ని మిగతా కథలో చూస్తాం.

కథనం
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనేది సింగిల్ లేయర్ స్టోరీ కాదు. 2002-03 సంవత్సరాల్లో జరిగినట్లుగా చూపించిన ఈ సినిమాలో సినిమాస్టార్‌ని వెర్రిగా అభిమానించే ఒక అభిమాని కథ ఉంది. అందమైన ప్రేమకథ ఉంది. తక్కువ అంతస్తు, లేదా తక్కువ జాతి వాడికి నా కూతుర్ని ప్రేమించే అర్హత ఉందా అనే అగ్ర కుల అహంకారం కథ ఉంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతూ హీరోగా వందవ సినిమా ఆగిపోతే తన కెరీర్ ఆగిపోయినట్లేనా, ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవాల్సిందేనా అనే ఒక నటుడి ఆవేదన కథ ఉంది. ఇన్ని లేయర్స్‌తో ఉన్న కథను ఎమోషనల్‌గా నడిపించడం కత్తి మీద సవారీ చేయడం లాంటిది. ఆ సవారీని సమర్థవంతంగా చేయడంలో దర్శకుడు మహేశ్‌బాబు పి. సక్సెస్ అయ్యాడు.

సినిమా మొదలై 20 నిమిషాలు దాటేవరకూ కథానాయకుడు రామ్ ఎంట్రీ ఉండదు. అప్పటివరకూ ఉపేంద్ర పోషించిన సూర్య పాత్రను ఎస్టాబ్లిష్ చేసి, అతని స్ట్రగుల్‌ను చూపించి, ఆ తర్వాత హీరో సాగర్ పాత్రను మన ముందుకు తెచ్చాడు దర్శకుడు. అక్కడి నుంచీ ఆ పాత్రను ఆయన తీర్చిదిద్దిన తీరు, దాన్ని క్రమక్రమంగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లిన తీరూ ప్రశంసనీయం. దర్శకుడి ప్రతిభను తెలియజేసే ఘట్టాలు, సన్నివేశాలు అనేకం సినిమా అంతటా ఉన్నాయి. సినిమా హీరోల అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులూ కథలోని ఎమోషన్‌తో, హీరో పాత్రతో కనెక్ట్ అవుతారు. ఫస్టాఫ్‌ని మించి సెకండాఫ్‌లో భావోద్వేగాలు మరింత బాగా మనల్ని కట్టిపడేస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు, మిగతా ప్రణయ సన్నివేశాలకు ముచ్చటపడతాం. హీరోపై హీరోయిన్ తండ్రి ఆగ్రహించే సన్నివేశాలు చూసి, హీరోని అతనేం చేస్తాడో అని ఆందోళనచెందుతాం. తనని అతిపెద్ద కష్టం నుంచి గట్టెక్కించిన అభిమాని సాగర్‌ని కలవడం కోసం స్టార్ హీరో సూర్య బయలుదేరినప్పుడు వాళ్లిద్దరూ కలుస్తారా, లేదా? ఆ ముగింపు ఎలా ఉంటుందనే ఉత్కంఠకు లోనవుతాం.

క్లైమాక్స్ సన్నివేశాలు సూపర్బ్. తెరపై స్టార్ హీరోలను చూసి స్ఫూర్తి పొందే అభిమానులుంటారు కానీ ఒక అభిమానిని చూసి ఒక స్టార్ హీరో ఎలాంటి స్ఫూర్తిపొందాడో క్లైమాక్స్‌లో చూసి ఆనందిస్తాం. కాకపోతే ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే ఇంకా గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేదనే అభిప్రాయం కలుగుతుంది.

నటీనటుల అభినయం
ఆంధ్ర కింగ్ అభిమాని సాగర్ పాత్రలో రామ్ పోతినేని ఇట్టే ఇమిడిపోయాడు. పందొమ్మిదేళ్ల క్రితం ‘దేవదాసు’ లాంటి హిట్ మూవీ హీరోగా పరిచయమై, ఇంతదాకా 23 సినిమాల్లో నటించిన అతను ఒక స్టార్ హీరో అభిమాని పాత్రను చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ పాత్రను అతను పోషించిన తీరు ఎంతైనా ప్రశంసనీయం. ఒక సినీ హీరో అభిమానిగా, ఒక ప్రేమికుడిగా ఆ పాత్రలోని మానసిక సంఘర్షణను అతను ఉన్నత స్థాయి హావభావాలతో ప్రదర్శించాడు. కచ్చితంగా అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్‌లో సాగర్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుంది. మరింత సర్‌ప్రైజింగ్ అనిపించింది మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటన. ఆ పాత్రకు తగ్గట్లు ఎంతో క్యూట్‌గా కనిపించిన ఆమె, రామ్ తో రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకున్న ఆమె, అతడితో ఒక ఎమోషనల్ సీన్‌లో చూపించిన హావభావాలు సూపర్బ్ అనిపిస్తాయి. ఈ సినిమా హిట్టయితే ఆమె కెరీర్ ఊపందుకొనే అవకాశాలు ఎక్కువ.

ఆంధ్ర కింగ్ సూర్య పాత్రకు ఉపేంద్ర పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. ఒక స్టార్ హీరోకు మార్కెట్ పడిపోయి, చేస్తున్న సినిమా మధ్యలో ఆగిపోయే స్థితి వస్తే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఉన్నత స్థాయి నటనతో చూపించాడు. సాగర్ తండ్రి పాత్రలో రావు రమేశ్, హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మకు వంక పెట్టాల్సిందేముంటుంది! అతి సునాయాసంగా ఆ పాత్రల్లో రాణించారు. హీరో ఫ్రెండ్ ఈశ్వర్‌గా రాహుల్ రామకృష్ణ, హీరో తల్లిగా తులసి, ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా సత్యా పాత్రల పరిధి మేరకు నటించారు. కాకపోతే స్టూడెంట్‌గా రాహుల్ రామకృష్ణ ఫుల్ బియర్డ్ లుక్ సూటవలేదు.

సాంకేతిక అంశాలు
మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ అండ వల్ల టెక్నికల్‌గానూ ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. వివేక్-మెర్విన్ మ్యూజిక్, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకి ఎమోషనల్ డెప్త్‌ను తీసుకొచ్చింది. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ మెచ్చుకోదగ్గ రీతిలో ఉంది.

తెలుగుప్రభ వర్డిక్ట్
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ వల్ల ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా అనుకోవచ్చు. కానీ 2000 కాలం మొదట్లో తెలుగునేలంతా ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన కథగా దీన్ని తీశారు కాబట్టి, ఇందులోని ఎమోషన్ ఏ ప్రాంతం వారికైనా కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ కావడానికి సినీ స్టార్ల అభిమానులే కావాల్సిన అవసరం లేదు.

రేటింగ్: 3/5

– బుద్ధి యజ్ఞమూర్తి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News