Anupam Kher: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివేంజ్’ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రెండు వారాల్లోనే ధురంధర్ పార్ట్ 1 కలెక్షన్స్ దాటేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇంకా బాక్సాఫీసు వద్ద వసూళ్ల ఊచకోత కొనసాగుతూనే ఉంది.
సౌత్ స్టార్స్ ప్రశంసలు
ధురంధర్ 2పై సాధారణ ఆడియన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ నుంచి అగ్ర దర్శకులు, హీరోలు ధురంధర్ 2 ప్రశంసిస్తూ ఆదిత్య ధర్ పనితనాన్ని కొనియాడుతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి అనవసరపు ప్రచారం చేస్తున్నారంటూ క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీపై వస్తున్న విమర్శలపై తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. చిత్రం అద్భుతంగా ఉందన్న ఆయన.. విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
వాటిని పట్టించుకోవద్దు..
సోమవారం (మార్చి ౩౦) ఢిల్లీలో జరిగిన దిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(IFFD) 2026లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ధురంధర్ 2పై దుష్ప్రచారం చేస్తోన్న వారిపై అసహనం వ్యక్తం చేశారు. ‘సినిమాను ప్రచారం అని పిలుస్తున్న వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారికోసం మనం చాలా సమయాన్ని వృథా చేస్తున్నాం. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ధురంధర్’ లాంటి చిత్రాల విజయాన్ని మనం వేడుకగా చేసుకుందాం. ప్రజలు అమాయకులు కారు. సినిమా నిజంగా నచ్చకపోతే మధ్యాహ్నం 12 గంటల షోలకు థియేటర్లు హౌస్‌ఫుల్ కావు. సినిమా నచ్చితేనే ప్రజలు చూస్తారు. సినిమాను విమర్శించే వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: Tovino Thomas: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రం చేయడం లేదు.. ఎందుకో చెప్పిన నటుడు
సమాజంపై సినిమా ప్రభావం..
అలాగే సమాజంపై సినిమాల ప్రభావం అంశంపై కూడా ఆయన మాట్లాడారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సినిమా పాత్ర ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటారన్నారు. అలాగే నటులకు శిక్షణ అనేది కూడా చాలా ముఖ్యమన్నారు. తాను 41 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానంటే దానికి కారణం తాను శిక్షణ పొందిన నటుడిని కావడమేనని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో తన ‘తన్వీ ది గ్రేట్’ 25 వారాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. పరిమిత థియేటర్లలో విడుదల చేసినప్పటికీ ప్రేక్షకుల ఆదరణతో ఈ ఘనత సాధించడం గొప్ప విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

