Postpone news of anushka ghati movie: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘ఘాటీ’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. అయితే గతంలో ప్రకటించిన విడుదల తేదీలు వాయిదా పడుతుండటంతో అభిమానుల్లో కొంత అసహనం వ్యక్తమవుతోంది. తాజాగా జూలై 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆలస్యం కానుందని సమాచారం.
ఆలస్యానికి.. మేకర్స్ ఏమంటున్నారంటే..!
ఇప్పటివరకు సినిమా ట్రైలర్ విడుదల కాకపోవడం, ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటి ఊపు లేకపోవడంతో సినిమా విడుదలపై సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా ఒక భావోద్వేగ ప్రకటనను విడుదల చేసింది. “సినిమా ఒక ప్రవహించే నది లాంటిది. ఒక్కోసారి పరుగులు తీస్తుంది, ఒక్కోసారి లోతు కోసం ఆగుతుంది,” అంటూ ప్రారంభమైన ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మేకర్స్ తమ ప్రకటనలో ‘ఘాటీ’ కేవలం ఒక సినిమా కాదని, అది పర్వతాల ప్రతిధ్వని, అడవుల గాలి, రాళ్లు, నేలలతో ముడిపడిన కథ అని పేర్కొన్నారు. ప్రతి ఫ్రేమ్‌ను, ప్రతి శ్వాసను గౌరవించేందుకు కొంత సమయం పట్టవచ్చని, కానీ ఇది చివరికి ప్రేక్షకులకు మరింత మధురమైన అనుభవాన్ని అందిస్తుందని వారు తెలిపారు.
ఈ ఆలస్యం వల్ల చిత్రం మీద ఉన్న బజ్ తగ్గిపోతుందా అనే సందేహాలున్నప్పటికీ, మేకర్స్ చెప్పిన ఈ భావోద్వేగ నోట్ అభిమానులకు కొంత భరోసా కలిగించింది. “మీ ప్రేమ, ఓర్పుకు ధన్యవాదాలు. ఈ కఠినమైన మార్గాల్లో మా వెంట నడిచినందుకు కృతజ్ఞతలు. మళ్లీ పర్వతాలు పిలిచే దాకా… మేము మీవారమే” అని ముగించిన ఈ సందేశం, చిత్ర బృందం సినిమా పట్ల ఎంత ప్రేమగా, నిబద్ధతతో పని చేస్తుందో తెలియజేస్తోంది.
ఈ సందర్భంగా ‘ఘాటీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు, విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముందని సమాచారం. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మళ్లీ పెరిగింది. మొత్తానికి, మేకర్స్ నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాను రూపొందిస్తున్నారని ఈ ప్రకటన స్పష్టం చేసింది. మరి వారి ఈ ప్రయత్నం ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచిచూడాలి.