Karthi – Khaithi 2: సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో దూకుడు పెంచారా..? అంటే, అవుననే మాట ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం ఘాటి సినిమాను పూర్తి చేశారు అనుష్క. ఆమెకి వేదం లాంటి సినిమాలో అద్భుతమైన పాత్ర ఇచ్చి కెరీర్‌లోనే మైల్‌స్టోన్ లాంటి సినిమాను ఇచ్చిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే, ఘాటి సినిమాలోని అనుష్క లుక్ ఆ తర్వాత వచ్చిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
వాస్తవానికి అనుష్క గతకొంతకాలం నుంచి ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిసెస్ నవీన్ పోలిశెట్టి లాంటి సినిమాలు చేశారు. అయితే, అవేవీ అనుష్కకి హిట్ ఇవ్వలేదు. అయినా ఎంతో సెలెక్టెడ్‌గా ఈ సీనియర్ హీరోయిన్ కొత్త సినిమాలకి సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కోలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సూర్య సరసన సింగం సిరీస్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు అనుష్క. ఇప్పుడు ఆయన తమ్ముడు, కోలీవుడ్ స్టార్ హీరో కార్తి సినిమాలో అనుష్కకి అవకాశం వచ్చిందట.
కార్తీ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ వచ్చి మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది.త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ 2 పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా సీక్వెల్ అనగానే ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. అయితే, ఖైదీ 2 మూవీలో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించనున్నారట. ఎప్పుడైతే ఖైదీ 2లో అనుష్క ఉన్నట్టు వార్తలు మొదలయ్యాయో అప్పటి నుంచి ప్రాజెక్ట్ మీద ఇంకా అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఖైదీ 2 మూవీలో అనుష్క శెట్టిది కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర అని సమాచారం. ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమాలోనూ కాస్త అనుష్క ది నెగిటివ్ టచ్ ఉన్న పాత్రే. ఈ సీనియర్ హీరోయిన్ ఎలాంటి పాత్రలనైనా చేయగలుగుతారు. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా అరుంధతి, పంచాక్షరి, భాగమతి, సైజ్ జీరో లాంటి ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేయగలరు. రజినీకాంత్ నటించిన లింగ సినిమాలోనూ అనుష్క హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇంత క్రేజ్ తెలుగుతో పాటు తమిళంలోనూ ఉంది కాబట్టి కార్తి నటించబోతున్న ఖైదీ సీక్వెల్‌లో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌లో అనుష్క జాయిన్ అయ్యే విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.