Mohan Babu: అసలే కుటుంబ వివాదాలతో తీవ్ర ఆవేదనలో ఉన్న నటుడు మోహన్ బాబుకు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. జర్నలిస్టులపై దాడి కేసులో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు తాజాగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అయితే న్యాయనిపుణులు సలహాతో బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసుగా మార్చారు. దీంతో ఆయనపై చట్టపర్యమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాగా మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసం జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్(Manchu Manoj) ఇంటి గేట్లను తన్నుకుంటూ లోపలికి వెళ్లడంతో జర్నలిస్టులు కూడా లోపలికి వెళ్లారు. అయితే దీంతో కోపోద్రిక్తుడైన మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కుని ముఖంపై దాడి చేశారు. ఈ దాడిలో సదరు జర్నలిస్టుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జర్నలిస్టుల సంఘాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.