నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), సంగీత దర్శకుడు తమన్(Thaman) కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య యాక్షన్‌కు తమన్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చే మ్యూజిక్‌కు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రావాల్సిందే. తమన్ బీజీఎంలకు థియేటర్ల సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే. బాలయ్య మూవీ అంటేనే తమన్‌కు పూనకం వస్తుంది. డాకు మహారాజ్ సినిమాలో తమన్ ఇచ్చిన సంగీతానికి అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో ముద్దుగా నందమూరి తమన్ అని పిలవడం మొదలుపెట్టారు. బాలయ్య సైతం నందమూరి తమన్ కాదు.. NBK తమన్ అంటూ పేరు పెట్టారు. సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది.

ఇక తాజాగా తమన్‌కు ఓ ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు బాలయ్య. కోటి రూపాయలకు పైగా విలువైన ఖరీదైన పోర్షే కారును బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తమన్, బాలయ్య కాంబోలో ఇప్పటి వరకు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలు వచ్చాయి. ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.
