HHVM Controversy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) . అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాకు ఊహించని అడ్డంకి ఎదురైంది. దాదాపు ఐదేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఇప్పుడు బీసీ (Backward Classes) సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జూలై 24న విడుదల కావాల్సిన ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అభ్యంతరాలు మరింత ఎక్కువయ్యాయి. అసలు వివాదం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే,
హరిహర వీరమల్లుపై బీసీ సంఘాల ఆగ్రహానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఈ సినిమా తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న (Panduga Sayanna) జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిందనే ప్రచారం ఉంది. అయితే, బీసీ సంఘాలు ఈ జీవిత చరిత్రను వక్రీకరించి, ఇష్టానుసారం కల్పిత కథగా మార్చారని తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడి పాత్రలో పవన్ కనిపించనున్నారు. హరిహర వీరమల్లు అనేది ఊహజనితమైన పాత్ర అని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియజేసింది. అయితే ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించేటప్పుడు కల్పిత పాత్రను సృష్టించటం అనేది బహుజనుల, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. వినోదం, డబ్బుల కోసం బహుజన నాయకుడి చరిత్రను తప్పుదోవ పట్టించేలా సినిమా తీస్తే ఊరుకోమని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శివ ముదిరాజ్ (Siva Mudiraj) సహా పలువురు ఈ ఆందోళనకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ పూటకో మాట మార్చి పండుగ సాయన్న జీవిత చరిత్రను తమకు ఇష్టం వచ్చినట్టుగా కల్పిత కథలు అల్లుతూ సినిమా తీస్తే, ఆయనపై ఉన్న గౌరవం పోతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యింది. తర్వాత కరోనా రావటం, పవన్ రాజకీయాల్లో బిజీగా మారటం వంటి పరిస్థితుల కారణంగా సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ఆ జరిగిన పరిణామాలు, పలు కారణాలతో క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏ.ఎం. రత్నం (A.M. Ratnam) కుమారుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
రిలీజ్ డేట్ గోల! ఇప్పటికే దాదాపు 14 సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు బీసీ సంఘాల ఆందోళనలతో చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కొత్త కష్టాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ వివాదంపై చిత్ర బృందం ఏమైనా వివరణ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. సినిమా విడుదల అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.