Chiranjeevi – Venkatesh: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
వెంకటేష్ రోల్….
కాగా చిరంజీవి సినిమాలో హీరో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఇన్నాళ్లుగా డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు నిర్మాతలు సైలెంట్‌గా ఉండటంతో చిరంజీవి, వెంకటేష్ కాంబో అన్నది గాసిప్ అయ్యి ఉండొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తున్నారంటూ అనిల్ రావిపూడి ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. అది కూడా గెస్ట్ రోల్ కాదని, కథలో కీలకంగా నిలిచే ఓ ఫుల్‌లెంగ్త్ రోల్‌లోనే ఆయన నటించబోతున్నట్లు అనిల్ రావిపూడి వెల్లడించాడు.
త్రిమూర్తులు మూవీ…
అనిల్ రావిపూడి మూవీ కంటే ముందు చిరంజీవి, వెంకటేష్ కలయికలో ఓ సినిమా వచ్చింది. వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా త్రిమూర్తులు పేరుతో సీనియర్ ప్రొడ్యూసర్ సుబ్బిరామిరెడ్డి 1987 లో ఓ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ మూవీ నసీబ్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలోని ఓ పాటలో చిరంజీవి గెస్ట్‌గా తళుక్కున మెరిశాడు.
ఒకే మాట ఒకే బాట…
ఒకే మాట ఒకే బాట అంటూ సాగే పాటలో త్రిమూర్తులు హీరోలు వెంకటేష్ అర్జున్, రాజేంద్రప్రసాద్‌తో పాటు చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, బాలకృష్ణతో పాటు హీరోయిన్లు విజయశాంతి, రాధ, రాధిక, భానుప్రియ…ఇలా ఇండస్ట్రీలో ఉన్న టానః హీరోహీరోయిన్లు అందరూ గెస్ట్‌లుగా నటించారు. యాక్టర్స్ మాత్రమే కాకుండా డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ కూడా ఈ పాటలో కనిపిస్తారు.
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక మూవీగా త్రిమూర్తులు నిలిచింది.
త్రిదేవ్…
1990లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో బాలీవుడ్ మూవీ త్రిదేవ్‌ను రీమేక్ చేసేందుకు రామానాయుడు ప్రయత్నించారు. కానీ కథ సరిగ్గా కుదరకపోవడంతో ఈ సినిమా స్క్రీన్‌పైకి రాలేదు. అనిల్ రావిపూడి మూవీతో చిరంజీవి, వెంకటేష్ కాంబో వెండితెరపై ఆవిష్కృతం కాబోతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.