మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఛావా'(Chhaava). గత నెలలో విడుదలైన చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు ‘శంభాజీ మహరాజ్’ పాత్రలో జీవించాడు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆయన భార్య పాత్రలో అలరించింది.
తాజాగా ఈ చిత్రం ‘బాహుబలి-2′(Bahubali-2) రికార్డును బ్రేక్ చేసింది. 2017లో విడుదలైన బాహుబలి-2 మూవీ హిందీలో రూ.510కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ కలెక్షన్లను ‘ఛావా’ మూవీ క్రాస్ చేసింది. అది కూడా కేవలం 25 రోజుల్లోనే రూ.516కోట్లు రాబట్టింది. మొత్తంగా హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టి చిత్రాల్లో ‘ఛావా’ 6వ స్థానంలో నిలిచింది. గత వారం తెలుగులో డబ్బింగ్ అయిన ఈ చిత్రం 4 రోజుల్లో రూ.10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.