భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(Waves)’ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ(PM Modi) ప్రస్తావించిన విషయం విధితమే. ఇందులో భాగంగా ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, షారుఖ్‌ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్‌కుమార్, అనిల్‌కపూర్, అనుపమ్ ఖేర్, హేమామాలినీ, దీపికా పదుకొణె తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు.
ఈ సమావేశం గురించి చిరంజీవి(Chiranjeevi) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందంటూ మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు. అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ ధన్యవాదాలు తెలిపారు. ‘‘వేవ్స్ కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మోదీ ఆలోచనలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని తెలిపారు.