మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 1980 ఫిబ్రవరి 20న దివంగత అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. నేటితో వీరి వివాహ బంధానికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. 40వ పెళ్లి రోజు వేడుకలను చిరంజీవి జంట విమానంలో జరుపుకోవడం విశేషం. నాగార్జున దంపతులు, మహేశ్ బాబు భార్య నమ్రత, ఇతర సన్నిహితులో కలిసి చిరంజీవి దుబాయ్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా విమానంలోనే తమ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకున్నారు. చిరంజీవి, సురేఖ నాగ్, నమత్ర బొకేలు అందించి విషెస్ తెలిపారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిరు వెల్లడించారు. తన జీవితానికి వెలుగు తీసుకొచ్చిన తన భార్య సురేఖ తనకు ఎంతో బలాన్ని, ధైర్యాన్ని అందించిందని తెలిపారు. ఆమె తన జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు ‘దసరా’ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనూ, బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమాలకు కమిట్ అయ్యారు.
