HomeTop StoriesAsha Bhosle: సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆశా భోంస్లే మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Asha Bhosle: సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆశా భోంస్లే మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Asha Bhosle Death: దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముుఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మధుర స్వరం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుందని.. ఆమె ఇక లేరనే వాస్తవం అత్యంత బాధాకరమైనదని విచారం వ్యక్తం చేశారు. 

- Advertisement -

ప్రముఖ లెజెండరీ గాయని, పద్మవిభూషణ్ గ్రహీత ఆశా భోంస్లే(92) ఆదివారం ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆమె, బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచంలో తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒక దిగ్గజ గాయనిగా ఆమె అద్భుతమైన ప్రస్థానం భారతదేశ సంగీతంలో ఒక శకానికి నాంది పలికిందని కొనియాడారు. కుటుంబీకులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/veteran-singer-asha-bhosle-passes-away/

ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె శ్రావ్యమైన మెలోడీలు, ఉత్సాహభరితమైన కంపోజిషన్లు ఏవైనా సరే, ఆమె స్వరంలోని అద్భుత ప్రతిభను చాటిచెప్పేవని కొనియాడారు. ఆమెతో తన సంభాషణలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె గళం శాశ్వతమని, రాబోయే తరాలకు ఆమె సంగీతం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆశా భోంస్లే మృతి కళా ప్రపంచానికి తీరని లోటని వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ విచారం వ్యక్తం చేశారు.  

భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలు, దశాబ్దాల పాటు పలు భాషల్లో ప్రదర్శించిన అపూర్వ ప్రతిభ చిరస్మరణీయని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆమె మరణం దేశంలోని సాంస్కృతిక, కళారంగాలకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana/medak-news/lack-of-coordination-among-ministers-at-patan-cherus-felicitation-ceremony/

దిగ్గజ, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆశా భోంస్లే భారతీయ గాయనిగా, ఆమె సంగీత చరిత్రలోనే అత్యధికంగా పాటలు పాడారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సంగీత పరిశ్రమకు ఆమె అసాధారణమైన సేవలు చేశారని కొనియాడారు. 

ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి అని మెగాస్టార్‌ చిరంజీవి కొనియాడారు. ఆమె పాడిన ప్రతి పాట ఒక సౌందర్యమని, ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె తన గళం, వ్యక్తిత్వంతో కలకాలం జీవిస్తారని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు. ఒక తరాన్ని నిర్వచించిన గొంతును ఈరోజు కోల్పోయామని, ఆమె ఒక అపరిమితమైన శక్తి అని సింగర్‌ శ్రేయాఘోషల్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

ఆశా భోంస్లే తన 90వ ఏట కూడా లైవ్‌ కచేరీలను కొనసాగించి సంగీత ప్రియులను అబ్బురపరిచారు. ఆమె అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News