2026 Sankranti Movies: సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి ఒక పెద్ద పండుగ. దర్శకులు, నిర్మాతలు ఈ పండుగను లక్ష్యంగా చేసుకొని ఏడెనిమిది నెలల ముందు నుంచే తమ కసరత్తులను ప్రారంభిస్తారు. చిత్రీకరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు, తమ అగ్రతారల చిత్రాలను పండగ బరిలో దించనున్నట్లు సిగ్నల్స్ ఇచ్చి బెర్త్‌లను ఖరారు చేసుకునే పనిలో పడిపోతారు. అయితే, ముగ్గుల పండక్కి సమయం దగ్గరపడే కొద్దీ ఈ లెక్కలన్నీ తారుమారవ్వడం సర్వసాధారణం. ప్రస్తుతం 2026 పెద్ద పండగ రేసులో నిలుస్తోన్న సినిమాలేవీ అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
2026 సంక్రాంతి చిత్రాలకు సంబంధించి ఇప్పటికే ఒక జాబితా ఖరారైంది. ఈ రేసులో చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా తొలి బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ కలయిక పండగను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు, ఇప్పుడు దీనికి తగ్గట్లుగానే చిత్రీకరణ శరవేగంగా సాగిపోతోంది. చిరంజీవి తర్వాత, మరో అగ్ర హీరో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం (కిశోర్ తిరుమల దర్శకత్వంలో) పండగ లక్ష్యంగానే చిత్రీకరణను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా, యువ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ ఇప్పటికే ముగింపు దశకు చేరువైనట్లు తెలుస్తోంది.
Also Read – Sara Tendulkar: బీచ్ లో అందాల సునామీ సృష్టించిన సచిన్ కూతురు
రానున్న సంక్రాంతి రిలీజ్ జాబితాలోకి మరికొన్ని సినిమాలు జత కలిసే అవకాశం లేకపోలేదని సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి రేసుపై కన్నేసిన సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ ముందు వరుసలో కనిపిస్తోంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించినా, పండగ బరిలో నిలిచే అవకాశమూ లేకపోలేదని చిత్ర వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ ‘రాజాసాబ్’ను సంక్రాంతి బరిలో చూడాలని కోరుకుంటున్నారని చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పటం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి.
సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ విషయంలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం దసరా బరిలో పోటీ పడనున్నట్లు నిర్మాతలు ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ‘అఖండ 2’ టీమ్ వైపు నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో ఇది వాయిదా పడే అవకాశమున్నట్లు నెట్టింట ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే, బాలయ్య సినిమా కూడా ముగ్గుల పండగ వైపే మొగ్గు చూపే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి, ‘అఖండ 2’ సెప్టెంబర్ 25 లక్ష్యంగా డబ్బింగ్ పనుల్ని, నిర్మాణానంతర కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోందని తెలిసింది.
ప్రతి ఏటా సంక్రాంతి బరిలో తెలుగు చిత్రాలతో పాటు అనువాద చిత్రాల సందడి కూడా కనిపిస్తుంది. ఈసారి, విజయ్ నటించిన ‘జన నాయకుడు’ పండగ బరిలో వినోదాలు పంచనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది, ఇది 2026 జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఇక దీంతో పాటే, సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న ‘పరాశక్తి’ కూడా సినీ ప్రియులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంపై అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అనువాద చిత్రాలను, తెలుగు చిత్రాలను కలుపుకుంటే, ప్రస్తుతానికి సంక్రాంతి రేసులో 7 చిత్రాలు ఉన్నట్లు లెక్క తేలుతోంది. మరి ఈ రేసులో చివరికి ఎన్ని మిగులుతాయి, ఎన్ని పోటీ నుంచి తప్పుకుంటాయి అనేది తేలాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.
Also Read – The Paradise First Look: ‘జడల్’గా నేచురల్ స్టార్.. ‘ది ప్యారడైజ్’.. ఇప్పటి వరకు చూడని సరికొత్త ఫస్ట్ లుక్


