Dil Raju on Percentage controversy in Tollywood: గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదంపై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు స్పందించారు. పర్సంటేజీ విధానంపై చర్చించి తామే సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగిందని, పర్సంటేజీ విధానంపై చర్చించామని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని గుర్తు చేశారు. పర్సంటేజీ విధానానికి సంబంధించి త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఏ, బీ, సీ (సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్) ఇలా ఆయా సెంటర్లలో థియేటర్‌ను బట్టి పర్సంటేజీని కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని తేల్చి చెప్పారు.
Also read: ఆయన ఫోటోలు, వీడియోలు వాడొద్దు.. సిటీ సివిల్ కోర్టు సంచలన ఆదేశాలు
పెద్ది రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బందుల్లేవు..
కాగా, మల్టీప్లెక్స్‌లో ఉన్నట్లే సింగిల్ స్క్రీన్‌లలో కూడా పర్సంటేజీ విధానం అమలు కావాలని, దీనికి అంగీకరించిన సినిమాలనే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పర్సంటేజీ విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాను లక్ష్యంగా చేసుకుని ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ‘పెద్ది’ సినిమా ఆరోగ్యకర వాతావరణంలో విడుదలవుతుందని దిల్ రాజు హామీ ఇవ్వడంతో త్వరలోనే సమస్యకు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ కనిపిస్తోంది.

