Mehar Ramesh: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మెహర్ జ్యోతి సుంకర సోమవారం రాత్రి విజయవాడలో కన్నుమూశారు. గత రెండు వారాలుగా వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను మెహర్ రమేష్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మా కుటుంబానికి తీరని లోటు
ఈ సందర్భంగా తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు తన ఫోటో షేర్ చేస్తూ.. “నా ప్రియమైన చిన్నక్క ‘మెహెర్ జ్యోతి సుంకర’ ఈ రోజు 9:45 pm కి విజయవాడ లో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతూ అనంతలోకాలకి వెళ్లిపోయారు. నా చిన్నప్పటి నుండి తను నా అండ.. ప్రేమగా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనంద పడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు” అంటూ రాసుకొచ్చారు.
Also Read: Jr NTR: మీ గర్జన కోసం ఎదురుచూస్తుంటాం… బాలకృష్ణ గాయంపై ఎన్టీఆర్ ట్వీట్
సినీ ప్రముఖుల సంతాపం
మెహర్ జ్యోతి మృతి వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెహర్ రమేష్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాప సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మెహర్ రమేష్ తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరిగా తెరకెక్కించిన ‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం మెహర్ రమేష్ సినిమాలకు కొంత విరామం ఇచ్చారు.

