Ram Gopal Varma: దళపతి విజయ్ జననాయగన్ రిలీజ్‌కు సెన్సార్ బోర్డు నుంచి అడ్డంకులు ఎదురవ్వడం దక్షిణాది చిత్రసీమలో ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు అంటూ కోర్టు తీర్పు అచ్చింది. ఈ తీర్పుపై మళ్లీ సీబీఎఫ్‌సీ మరో పిటిషన్ వేయడం చర్చనీయాంశం అవుతోంది. సెన్సార్ తీరుపై మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా పొలిటికల్ డైలాగ్స్, హింసాత్మక సన్నివేశాలను చాలానే కట్ చేయాలని సెన్సార్ బోర్డు చెప్పిందట. కానీ మేకర్స్ అందుకు ఒప్పుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. జననాయగన్ రిలీజ్‌ను సెన్సార్ బోర్డు అడ్డుకోవడాన్ని కోలీవుడ్ వర్గాలు తప్పుపడుతున్నాయి. సెన్సార్ నియమనిబంధనలను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జననాయగన్ సెన్సార్ వివాదంపై డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read – Prasar Bharati: ప్రసార్ భారతిలో నెలకు 50 వేలతో ఉద్యోగాలు..!
సెన్సార్ బోర్డు ప్రజలను కాపాడేందుకు కాకుండా కేవలం ఆడియెన్స్‌ను అవమానించడానికే ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు అవసరమా అంటూ తన ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు. టీవీ డిబేట్ల పేరుతో న్యూస్ ఛానెళ్ల నుంచి యూట్యూబర్ల వరకు అందరూ బూతులు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ, కుల మతాల గొడవలు, వ్యక్తిత్వ హననం లైవ్‌లో సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా అన్నది శక్తి వంతమైన మాధ్యమం అన్నది పాత నమ్మకం. ప్రస్తుతం సినిమా కంటే సోషల్ మీడియా ప్రభావం వంద రెట్లు ఎక్కువ. నేటి రోజుల్లో ఓ సీన్ కట్ చేసి, సిగరెట్ తాగే సీన్ బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షించవచ్చు అని సెన్సార్ బోర్డు నమ్మకం పెద్ద జోక్‌గా అనిపిస్తుందని వర్మ అన్నారు.
మనల్ని ఎవరు పాలించాలో మనమే నిర్ణయించుకుంటున్నాం… అలాంటప్పుడు ఏ సినిమా చూడాలో, ఏం వినాలో నిర్ణయించుకునే హక్కు లేదా అంటూ వర్మ ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు రక్షణ పేరుతో నాటకం ఆడుతుంది. నైతిక బాధ్యత అనే ముసుగును అడ్డుపెట్టుకొని అధికారం చెలాయిస్తుంది. సోషల్ మీడియాలో ఘోరమైన దారుణమైన హింసను చూసి ఆనందించే జనం… అదే థియేటర్లలో చూపిస్తే ఆందోళనకు దిగుతున్నారు. అరచేతుల్లో అరాచకం ఉన్న ఈ రోజుల్లో ఇంకా సెన్సార్ బోర్డు ఎందుకు అంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వర్మ ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read – TheRajaSaab: ప్రభాస్ రాజాసాబ్ కలెక్షన్స్ – సలార్‌లో సగం కూడా రాలేదుగా!

