Ravi Babu: నటుడు దర్శకుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నువ్విలా, అవును వంటి క్రైం థ్రిల్లర్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు పొందాడు. వైవిధ్యమైన చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్నారు. ఇక ఆయన సినిమాల్లో వైవిధ్యత ఎలా ఉంటుందో.. నిజ జీవితంలో రవిబాబు తీరు కూడా భిన్నంగా ఉంటుంది. అభిప్రాయం ఏదైనా ముక్కుసూటిగా బయటపెడుతుంటారు. ఈ క్రమంలో ఆయన చేసే వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారుతుంటాయి.
తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ ఆయన టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. లాంగ్ గ్యాప్ తర్వాత రవిబాబు ఓ క్రైం థ్రిల్లర్ చిత్రంతో వస్తున్నారు. అదే రేజర్. తన తండ్రి, దివంగత నటుడు చలపతి రావు జయంతి సందర్భంగా ఈ సినిమాను మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషనల్ లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రవి బాబు నేటి తరం సినిమా మేకింగ్ విధానంపై అసహనం వ్యక్తం చేశారు.
గతంలో మూవీ తీయడం అంటే ఒక క్రమశిక్షణ, గౌరవం ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో ఫిల్మ్ మీద సినిమా తీసేవాళ్ళం. ప్రతి అడుగు చాలా ఖరీదైనది. అందుకే డైరెక్టర్లు, కెమెరామెన్లు, హీరో హీరోయిన్లు ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా పని చేసేవాళ్ళు. సమయానికి, డబ్బుకి విలువ ఇచ్చేవాళ్ళు” అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ కావడంతో బాధ్యత లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. చిప్ తీయడం, ఎరైజ్ చేయడం.. ఖర్చుతో పని లేకుండా షూటింగ్ నడుస్తోంది. దీనివల్ల టెక్నాలజీ మీద, టైమ్ మీద ఎవరికీ గౌరవం లేకుండా పోయింది.
అసలు ప్రొడక్షన్ ప్లానింగ్ అనేదే లేదు. ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు ప్రవర్తిస్తున్నాడు. నిజం చెప్పాలంటే, ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒళ్ళు బలిసి తీస్తున్నారు‘ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన అన్న దాంట్లో నిజం ఉందని క్రమశిక్షణ లేని మేకింగ్ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారనేది వాస్తవమని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన వాడిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

