2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన ముంబై అంథేరి కోర్టు. ఫిర్యాదుదారునికి ఆర్జీవీ 3 నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది కోర్టు. తీర్పు చెప్పే సమయంలో ఆర్జీవీ కోర్టులో లేనందున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది.
శివ, సత్య, రంగీల, కంపెనీ, సర్కార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతకొన్నేళ్లుగా హిట్లు లేక చతికిలపడ్డారు. ఏడేళ్లకుపైగా ఆయన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోగా, కోవిడ్ సమయంలో పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని చివరికి తన ఆఫీసును కూడా ఆయన అమ్ముకున్నారు. ఆతరువాతి కాలంలో తన మార్కు సినిమాలను తీయటం మానేసి వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయారు వర్మ.
తాజాగా సిండికేట్ అనే సినిమాను అనౌన్స్ చేసిన వర్మ ఆ మరుసటి రోజే ఇలా కోర్టు కేసులో శిక్షను అనుభవించటం లేదా నష్టపరిహారం చెల్లించాల్సిరావటం విశేషం.