దర్శకుడు త్రినాథరావు (Trinadha Rao Nakkina) మహిళలకు క్షమాపణలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ ఆయన ‘మన్మథుడు’ హీరోయిన్ అన్షు(Anshu) గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. దీంతో త్రినాథరావు తాజాగా మహిళలకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.
“నేను మాట్లాడిన మాటలు చాలా మంది మహిళల మనసులు నొప్పించిందని విషయం అర్థమైంది. నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లోంచి వచ్చిన మాటలే తప్ప నేను కావాలని చెప్పింది కాదు. అయినా సరే మీ అందరి మనసులు నొప్పించాను. తప్పు తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. పెద్ద మనసు చేసుకొని క్షమించండి. మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అన్షు గారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. దయచేసి నన్ను పెద్దమనిషి చేసుకుని క్షమించండి” అని ఆయన అన్నారు.
కాగా ఈ ఈవెంట్‌లో అన్షు గురించి ఆయన మాట్లాడుతూ.. ఫారిన్‌లో సెటిల్ అయిన ఆమె సన్నగా ఉండడంతో కొంచెం తిని లావు అవమని చెప్పానని.. ఎందుకంటే తెలుగు వారికి కొంచెం సైజులు పెద్దగా ఉంటేనే ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.