Hari Hara Veera Mallu: ఏదైతేనేం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ ఎట్టకేలకు వచ్చి పడింది! వచ్చిన రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా రికార్డులు బద్దలు కొట్టింది. ఈ విషయంలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ట్రైలర్‌కు ముందు ఈ సినిమాపై డిస్ట్రిబ్యూషన్స్ వర్గాల్లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. కానీ ట్రైలర్ తర్వాత లెక్కలు మారిపోయాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఐదేళ్ల నుంచి సినిమా సెట్స్‌పై ఉన్నప్పటికీ నిర్మాత ఏ.ఎం. రత్నం గారు, బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ చేయకుండా ట్రైలర్ కోసమే వెయిట్ చేశారట. ఇప్పుడు ఏరియాల వారీగా బయ్యర్లతో చర్చల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఏపీ, తెలంగాణలో దాదాపు వంద కోట్లకి పైగానే థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నారని టాక్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ కి ఇది పెద్ద అమౌంట్ కాదంటారు కొందరు.
కాకపోతే, సినిమా రిలీజ్ కి ఇంత ఆలస్యం అవ్వడం హైప్ మీద కాస్త ప్రభావం చూపించిందని, ట్రైలర్ ముందు వరకు డిస్ట్రిబ్యూటర్లు కూడా థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేశారని టాక్. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అందరి అంచనాలు మారిపోయాయి. సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు మేకర్స్‌తో ఏరియా రైట్స్ విషయంలో వారు చెప్పిన మొత్తానికి అటు ఇటుగా హక్కులు సొంతం చేసుకోవటానికి సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఈ లెక్కల విషయంలో ఓ క్లారిటీ రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో డైరెక్టర్ జ్యోతి కృష్ణ అండ్ టీమ్ నిద్రాహారాలు కూడా మాని పని చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో క్వాలిటీ విషయంలో కొన్ని తేడాలు ఉండొచ్చు, కానీ సినిమా మాత్రం సూపర్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్స్ ఉండవని, టీమ్ పడిన కష్టం ప్రేక్షకులకి మంచి అనుభూతినిస్తుందని చెబుతున్నారు.
జూలై 24 రిలీజ్ డేట్ మాత్రం పక్కా బాగుంది! ‘కుబేర’ తర్వాత బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు తగ్గుముఖం పట్టాయి కదా. ‘కన్నప్ప’ జోరు మూడే రోజలు, నితిన్ ‘తమ్ముడు’ అయితే బిగ్ డిజప్పాయింట్. జూలై 11న వచ్చే ‘ఓ భామ అయ్యో రామా’, జూలై 18న రిలీజయ్యే ‘జూనియర్’ లాంటి సినిమాలు పెద్ద టెన్షన్ ఇచ్చేవి కావు. వాటికి ఎక్స్‌ట్రార్డినరీ టాక్ వస్తే తప్ప జనాలు చూడరు. ప్రస్తుతానికి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, డిస్ట్రిబ్యూషన్ వర్గాలు హరిహర వీరమల్లు మీద పాజిటివ్‌గానే ఉన్నాయి. రిలీజ్‌కి ఇంకో పంతొమ్మిది రోజులే టైం ఉంది కాబట్టి, మరో వారంలో బయ్యర్ల లిస్ట్ అంతా ఫైనల్ అయిపోతుంది. చూడాలి మరి, పవర్ స్టార్ మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర ఎలా వర్కౌట్ అవుతుందో! ఈ సినిమా అంచనాలని అందుకుని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిద్దాం.