Divya Spandana: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల వీధి కుక్కల సమస్యపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి రమ్య చేసిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి బుధవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు వీధి కుక్కుల కాటు, ప్రజా భద్రత అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. “వీధి కుక్కల మనసుని చదవలేం. ప్రజల భద్రత దృష్ట్యా వాటిని షెల్టర్లకు తరలించాలి” అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రమ్య స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
“అబ్బాయిల మనసు కూడా చదవలేం. వాళ్లెప్పుడు రేప్ లేదా మర్డర్ చేస్తారో తెలియదు. మరి అందరినీ జైలులో పెట్టాలా?” అని రమ్య ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్‌గా మారి.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అయితే రమ్య వ్యాఖ్యల్లో మగవాళ్లను కుక్కలతో పోల్చినట్లుగా అర్థం వస్తోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read – Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్.. సంక్రాంతికి నవ్వించనున్న నవీన్ పొలిశెట్టి
ముఖ్యంగా ఆమె వ్యాఖ్యలు సమస్త పురుషులపై అనవసరంగా అపవాదు మోపినట్టుగా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను మహిళల భద్రతపై జరుగుతున్న చర్చలో భాగంగా చూడాలంటూ మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా, సుప్రీంకోర్టు స్ట్రీట్ డాగ్స్ అంశంపై చేసిన వ్యాఖ్యలకు అనుసంధానంగా రమ్య చేసిన ఈ పోస్ట్ రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

