Fish Venkat: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ సాయం చేసాడని ఇటీవలే కొన్ని వార్తలొచ్చాయి. అతని ఆస్పత్రి ఖర్చుల కోసం డార్లింగ్ ప్రభాస్ రూ.50 లక్షలు సాయం ప్రకటించారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయంపై ఫిష్ వెంకట్ భార్య స్పష్టత ఇచ్చారు.
“ప్రభాస్ రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. బహుశా మా కష్టం గురించి ప్రభాస్ గారికి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. తెలిస్తే మాత్రం ఆయన తప్పకుండా సాయం చేయడానికి ముందుకొస్తార”ని ఫిష్ వెంకట్ భార్య అన్నారు.
అసలు ఏమైందంటే:
హాస్యనటుడు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మీడియాతో మాట్లాడుతూ కొన్ని వివరాలు పంచుకున్నారు. “హీరో ప్రభాస్ టీమ్ తనకు ఆర్థిక సహాయం చేస్తున్నారట. ప్రభాస్ అసిస్టెంట్ ఒకరు కాల్ చేసి ‘కిడ్నీ ఇచ్చే దాత ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు పంపిస్తాం’ అని హామీ ఇచ్చార”ని ఆమె మీడియాతో తెలిపారు.
ఇదే విషయంపై ప్రభాస్ రూ.50 లక్షలు సాయం చేశాడని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, వీటిలో నిజం లేదని ఫిష్ వెంకట్ భార్య స్పష్టం చేశారు. సాయం చేస్తామని కాల్ చేసిన నెంబర్‌కు ట్రై చేస్తుంటే ఎలాంటి స్పందన రావట్లేదని ఆమె తెలిపారు. అయితే హీరో ప్రభాస్ నుంచి ఎలాంటి సాయం అందలేని ఆమె చెప్పుకొచ్చారు.
ఫిష్ వెంకట్ హెల్త్ కండీషన్ ఎలా ఉందంటే?
కిడ్నీ ఫెయిల్యూర్ తో కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం బోడుప్పల్ లోని ఆర్‌బీఎం ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్ కు సాయం చేయాలని ఆయన కుటుంబం వేడుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలో పెద్దలు స్పందించి సాయం చేయాలనీ వారు వేడుకుంటున్నారు.

