Angammal Review: ‘అంగమ్మాళ్’ అనేది 2025 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన తమిళ డ్రామా సినిమా. ఇప్పుడు సన్ ఎన్ఎక్స్‌టి ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. పెరుమాళ్ మురుగన్ రాసిన చిన్న కథ ‘కొడితుని’ ఆధారంగా దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ ఈ మూవీని రూపొందించాడు. 1990ల గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో, స్వేచ్ఛా స్వభావి అయిన అంగమ్మాళ్ (గీతా కైలాసం) అనే ఒక పెద్దావిడ జీవితం చుట్టూ తిరిగే ఈ చిత్రం సామాజిక నిబద్ధతలు, తరాల మధ్య వ్యత్యాసాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై లోతైన చర్చను అందిస్తుంది.
1990లలో ఒక గ్రామంలో ఒంటరి వితంతువు అంగమ్మాళ్ స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతుంటుంది. ఒంటిపై రవిక ధరించదు. పాలు అమ్ముతూ, తన ఇష్టానుసారం బతుకుతుంటుంది. ఆమె చిన్న కొడుకు పవలం (శరణ్ శక్తి) డాక్టర్ అయి సిటీ నుంచి తిరిగి వస్తాడు. తన ప్రియురాలు జాస్మిన్ (ముల్లయరసి) కుటుంబ సభ్యులని తమ ఇంటికి తీసుకురావాలని, అమ్మను ‘సభ్యత’ ప్రకారం బ్లౌజ్ వేసుకోమని అడుగుతాడు. అంగమ్మాళ్ దాన్ని తిరస్కరిస్తుంది. ఈ చిన్న విషయం కుటుంబంలో పెద్ద సంఘర్షణకు దారితీస్తుంది. పెద్ద కొడుకు సుదలై (భరణి), మనవడు, కోడలు శారద (తెండ్రల్ రఘునాథన్)ల మధ్య భావోద్వేగాలు తీవ్రమవుతాయి. చివరికి సామాజిక నిబద్ధతలు, వ్యక్తిగత గౌరవం మధ్య జరిగే పోరాటాన్ని ఈ కథ భావోద్వేగపూరితంగా చూపిస్తుంది.
సినిమా చాలా సహజంగా మొదలవుతుంది. గ్రామీణ నేపథ్యం, ఉచ్చిమలై కాత్తు (ప్రత్యేక గాలి) లాంటి అల్లెగరీలతో దర్శకుడు భావోద్వేగాలను బలంగా నిర్మిస్తాడు. కథ పూర్తిగా ఒకే పాయింట్ చుట్టూ తిరిగినా, పాత్రల మధ్య సంభాషణలు, చిన్న చిన్న డీటెయిల్స్ ద్వారా ఆసక్తి కొనసాగుతుంది. బ్లౌజ్ ధరించకపోవడం అంగమ్మాళ్ స్వేచ్ఛకు చిహ్నం. ఇది కేవలం దుస్తుల విషయం కాదు – తరాల మధ్య గ్యాప్, క్లాస్ భేదాలు, సమాజం ఒత్తిడి, స్త్రీ స్వాతంత్ర్యం లాంటి లోతైన అంశాలను స్పృశిస్తుంది. దర్శకుడు ఎవరి వైపూ పక్షపాతం చూపకుండా, అందరినీ తప్పులు చేసేవాళ్లుగా, వాస్తవికంగా చూపిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లు లేకుండా వర్తమాన సంఘటనల ద్వారానే గతాన్ని అర్థమయ్యేలా చేశాడు. లైవ్ సౌండ్, నేచురల్ డైలాగ్స్ సినిమాను మరింత రియలిస్టిక్‌గా మారుస్తాయి. మధ్యలో కాస్త స్లో అయినా, ఎమోషనల్ బిల్డప్ బాగుంది. చివరి భాగంలో అంగమ్మాళ్ గతకాలపు ఫోటో చూసి ఆమె గౌరవాన్ని అంగీకరించే సీన్ హైలైట్. మొత్తంగా ఇది స్లైస్-ఆఫ్-లైఫ్ డ్రామా కానీ, లోతుగా ఆలోచింపజేసే చిత్రం. ఫిలాసఫికల్ టోన్ ఉన్నా ఓవర్ డ్రామాటిక్ కాకుండా బ్యాలెన్స్డ్‌గా ఉంది.
గీతా కైలాసం ఈ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసేసింది. అంగమ్మాళ్ పాత్రలో ఆమె చూపిన స్టబ్బోర్న్‌నెస్, ఒంటరితనం, గర్వం, విట్.. అద్భుతం. బాడీ లాంగ్వేజ్, కనుచూపులు, నడకలోనే ఆమె పాత్ర జీవంతో తొణికిసలాడుతుంది. ఆమె ఒక్క అభినయం వల్లనే సినిమా గుర్తుండిపోతుంది. శరణ్ శక్తి (పవలం) యువ డాక్టర్‌గా సిటీ ఇన్‌ఫ్లుయెన్స్‌తో మారిన మనిషిగా బాగా చేశాడు. అతని అంతర్గత సంఘర్షణ సహజంగా కనిపిస్తుంది. భరణి (సుదలై) సైలెంట్, ఆలోచనాత్మక పాత్రలో చక్కగా ఉన్నాడు. కోడలుగా తెండ్రల్ రఘునాథన్ తన అణచివేతను, బాధను బాగా ప్రదర్శించింది. ముల్లయరసి, మిగిలిన తారలు కూడా వాస్తవికంగా నటించారు. మొత్తంగా ఎవరూ ఓవర్ యాక్ట్ చేయకుండా, పాత్రలకు జీవం పోసినట్టు అభినయించారు. ఇది పూర్తిగా క్యారెక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కావడంతో నటీనటుల బలం మూవీకి హైలైట్.
సినిమాటోగ్రఫీ (అంజాయ్ సామ్యూల్) గ్రామీణ వాతావరణాన్ని సూపర్బ్‌గా క్యాప్చర్ చేసింది. నేచురల్ లైటింగ్, లాంగ్ షాట్స్ సినిమాకు ఆథెంటిక్ ఫీల్ ఇచ్చాయి. ఎడిటింగ్ (ప్రదీప్ శంకర్) సాఫీగా, అనవసర డ్రాగ్ లేకుండా ఉంది. మోహమ్మద్ మక్బూల్ మన్సూర్ నేపథ్య సంగీతం ఎమోషన్స్‌ను సబ్‌టైల్‌గా, ఓవర్ డోస్ లేకుండా బలపరిచింది. లైవ్ సౌండ్ డిజైన్ రియలిజం పెంచింది. ప్రొడక్షన్ డిజైన్ 90ల గ్రామాన్ని కచ్చితంగా తీసుకొచ్చింది. మొత్తంగా సాంకేతిక టీమ్ చాలా మెచ్యూర్డ్‌గా పనిచేసింది. ఇండీ బడ్జెట్ సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూ హై.
‘అంగమ్మాళ్’ సాధారణ కథతో అసాధారణ అనుభూతిని ఇచ్చే సినిమా. గీతా కైలాసం అద్భుత అభినయం, లోతైన థీమ్స్, వాస్తవిక కథనంతో మంచి సినిమాని చూసిన సంతృప్తినిస్తుంది. స్వేచ్ఛ, గౌరవం గురించి ఆలోచింపజేస్తుంది. తప్పక చూడాల్సిన చిత్రం!
రేటింగ్: 3.5/5
– యజ్ఞమూర్తి

