తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో ‘గుండమ్మ కథ’(Gundamma Katha)ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఈ సినిమా నేటితో 63 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గుర్తుచేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది.
అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా.. సావిత్రి, జమున హీరోయిన్లుగా విజయా సంస్థ.. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించింది. అయితే ఈ సినిమాకు ‘గుండమ్మ కథ’ అనే పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలు కలిసి నటించే సినిమాకు సూర్యకాంతం టైటిల్ రోల్ పోషించే పేరు ఎందుకు పెట్టారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినా కానీ కథా రీత్యా ఇద్దరు హీరోలు, నిర్మాతలు ఆ పేరుకే మొగ్గు చూపారు. హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రంలో ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి అగ్ర నటులు నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.
ఈ చిత్ర కథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి(సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ(జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేది చాలా చక్కగా తెరకెక్కించారు.
Gundamma Katha: ‘గుండమ్మ కథ’కు 63 ఏళ్లు.. స్పెషల్ వీడియో
సంబంధిత వార్తలు | RELATED ARTICLES