పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిది కావడంతో, అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఉగాది సందర్భంగా చిత్రబృందం పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌ను విడుదల చేయగా, ఆయన స్టైలిష్ అవతార్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ లుక్ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచింది. ఇక తాజా సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని థియేటర్‌లో కట్టిపడేయబోతున్నాయని చెబుతున్నారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్ర క్లైమాక్స్ కోసం ఏకంగా 42 రోజుల పాటు భారీ షెడ్యూల్ నిర్వహించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదే అతిపెద్ద క్లైమాక్స్ షూట్ అని చెబుతున్నారు. అయితే సినిమా ఈ భారీ పోరాట సన్నివేశంతోనే ముగియనుందంట.. నవంబర్ నుంచి ఇరాన్‌లో మరో 8 నిమిషాల ప్రత్యేక పోస్ట్-క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని సమాచారం. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరచే విధంగా రూపొందించనున్నారని టాక్.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్, “మాట వినాలి”, “కొల్లగొట్టినాదిరో” అనే పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. త్వరలో మూడో సాంగ్ కూడా విడుదల కానుందని సమాచారం. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం మే 9న గ్రాండ్ రిలీజ్ కానుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.