Megastar on arrested Ibomma ravi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన రవి అరెస్ట్‌పై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేక పైరసీ కార్యకలాపాలపై సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీసుకున్న చొరవను, ఈ కేసు ఛేదనలో పాలుపంచుకున్న పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.
“ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం సంతోషం. పైరసీపై పోరాటంలో సజ్జనార్ గారు చూపిన చొరవ నిజంగా అభినందనీయం. ఇందులో భాగస్వాములైన పోలీసులందరికీ నా ధన్యవాదాలు” అని చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. “పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో, తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి ఖండాంతరాలకు వెళ్తోంది. అలాంటి సమయంలో పైరసీ అనేది ఈ పరిశ్రమకు అతిపెద్ద ఛాలెంజింగ్‌గా మారింది” అని ఆయన అన్నారు.
సినిమా రంగంపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, పైరసీ వలన నిర్మాత నష్టపోవడమే కాకుండా, ఈ పరిశ్రమలోని కార్మికుల ఉపాధికి కూడా ప్రమాదం ఏర్పడుతోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై నిరంతర పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఆయన అన్నారు. సినిమా పైరసీ పై యుద్ధం జరుగుతూనే ఉండాలి. పోలీసు వ్యవస్థ, సినీ పరిశ్రమ కలిసికట్టుగా దీనిని అడ్డుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. పైరసీని అరికట్టడానికి సినీ ప్రముఖులు, నిర్మాతలు మరియు పోలీసులు మరింత పకడ్బందీగా పనిచేయాలని, టెక్నాలజీని ఉపయోగించి ఇటువంటి వెబ్‌సైట్‌లను ప్రారంభ దశలోనే అడ్డుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.
ఐబొమ్మ కార్యకలాపాల వల్ల టాలీవుడ్‌కు దాదాపు ₹3,700 కోట్ల నుండి ₹24,000 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుగు సినీ నిర్మాతల సంఘం అంచనా వేసింది. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే హెచ్‌డీ ప్రింట్‌లను అప్‌లోడ్ చేస్తూ, రవి తన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ మరియు ఇతర ప్రకటనల సంస్థలతో చేతులు కలిపి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు అతని బ్యాంకు ఖాతాలో ఉన్న సుమారు ₹3 కోట్లు ఫ్రీజ్ చేశారు. అరెస్టు అనంతరం, రవిని నాంపల్లి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

