ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప2’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ మరో అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ త్వరలోనే ‘ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్’ పేరుతో భారత్‌లో అడుగుపెట్టనుంది. అయితే తొలి మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ముద్రించింది. బాలీవుడ్ హీరోలకు సైతం దక్కని గౌరవం తెలుగు హీరోకు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కవర్ పేజీ ఫోటో షూట్ అనంతరం బన్నీ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నానని తెలిపారు. పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యమన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తాను వంద శాతం సామాన్యుడిగానే ఉంటానని పేర్కొన్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ మ్యాగజైన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్‌గా విదేశాల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ దర్శకత్వంలో రెండు సినిమాలకు చేయనున్నారు.
