Yellamma: యూత్ స్టార్ నితిన్ నటించిన తమ్ముడు రిలీజ్‌కి రెడీ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ తమ్ముడు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ లయ, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ, వర్ష ముఖ్య పాత్రల్లో నటించారు. లయ నితిన్ సోదరిగా నటించారు. ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం బాగానే మూవీపై బజ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించగా జూలై 4వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. గతకొంతకాలంగా సక్సెస్‌లు లేని నితిన్, తమ్ముడు చిత్రంతో హిట్ కొడతానని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
అయితే, నితిన్ కి ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్స్ మాత్రం వరుసబెట్టి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు బ్యానర్‌లో మరో సినిమాను చేయబోతున్నాడు. బలగం మూవీతో దర్శకుడిగా వేణు బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే ఎల్లమ్మ సినిమా తెరకెక్కనుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ నటించబోతుంది. ఎల్లమ్మ పాత్రలో ఎంతో నేచురల్‌గా కీర్తి రోల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.
మహనటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి ఆ తర్వాత ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. అంతేకాదు, సాని కాయిథం లాంటి డీ గ్లామర్ రోల్స్ కూడా చేశారు. తెలుగులో నితిన్ తో కలిసి రంగ్ దే సినిమాను చేశారు కీర్తి. ఆ తర్వాత నానితో చేసిన దసరా మూవీ ఆమె కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. అయితే హిందీలో బేబి జాన్, అక్క వెబ్ సిరీస్‌లతో బిజీగా మారారు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత దిల్ రాజు సంస్థలోనే రెండు సినిమాలకి సైన్ చేశారు.
అయితే, నితిన్ నటించబోతున్న ఎల్లమ్మ సినిమాకి సంబంధించి మేకోవర్ విషయంలో వేణు చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. పొడవాటి జుట్టు, ఏపుగా పెంచిన గడ్డం ఇప్పుడు యూత్ హీరోలు ఫాలో అవుతున్న ట్రెండ్. భైరవం మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే కనిపించారు. దసరా మూవీలో నాని, పుష్ప సిరీస్‌లో అల్లు అర్జున్ ఇలాంటి మేకోవర్‌తోనే కనిపించారు. ఇలాంటి మేకోవర్‌లోనే ఎల్లమ్మ సినిమాలో నితిన్ కనిపించబోతున్నారట. ఇప్పటి వరకు నితిన్ చాలా కూల్‌గా క్లాస్ హీరోగా కనిపించాడు. కానీ, ఎల్లమ్మ కోసం మాత్రం లుక్ మొత్తాన్ని మార్చేస్తున్నారట. చూడాలి మరి ఈ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.