టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటీ సోదాలు(IT Raids) కలకలం రేపుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున నుంచే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్షిత ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. మొత్తం 8 చోట్ల 55 మంది అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు.
మరోవైపు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రీ సంస్థ నిర్మాతలు నవీన్, రవిశంకర్, సీఈవో చెర్రీ ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
కాగా ఇటీవల దిల్ రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాత్రం పెద్ద హిట్ అయి మంచి లాభాలు తీసుకొస్తుంది. అలాగే ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాను కూడా ఆయన నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప2 బ్లాక్‌బస్టర్ అయిన విషయం విధితమే. ఏకంగా రూ.1900కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో వారి ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.