ఏప్రిల్ 16వ తేదీన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు (Kandukuri Veereshalingam) 177వ జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకొని కళాకారులకు కందుకూరి ప్రతిష్టాత్మక, విశిష్ట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కందుకూరి అవార్డుల అంశాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలో సంబంధిత పురస్కారాలను కళాకారులకు అందించేలా పునరుద్ధరించామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
నాటక రంగంలో కృషి చేసిన వారికి రాష్ట్రస్థాయిలో కందుకూరి ప్రతిష్టాత్మక రంగ స్థల పురస్కారం, జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేయనున్నామన్నారు. ఈ నేపథ్యంలో కందుకూరి పురస్కారాలకు అర్హులైన రచయితలు, దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు ఏప్రిల్ 7వ తేదీ(సోమవారం) లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న వారు రాష్ట్రస్థాయి అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరించబోమన్నారు. దరఖాస్తులను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఎన్న ఎన్టీఆర్ పరిపాలన భవనం నాలుగో అంతస్థులో నేరుగా అందజేయవచ్చన్నారు. దరఖాస్తు ఫారమ్ లను www.apsftvtdc.in నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కందుకూరి పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో కళలు, నాటక రంగాలని పట్టించుకోలేదని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుర్తుచేశారు. ఈ క్రమంలో కనుమరుగైన కళలను,చేయూతకు నోచుకోని కళాకారులకు అండగా నిలిచి నాటక రంగానికి పునరుజ్జీవం తెస్తామన్నారు.కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.ఇప్పటికే ఉగాది పురస్కారాలను ప్రదానం చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుర్తుచేశారు. ఆ వెంటనే కందుకూరి పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని ప్రతి ఒక్క కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేగాక త్వరలోనే నందినాటకోత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను ఖరారుచేస్తూ ప్రకటన చేస్తామన్నారు.
భూత, భవిష్యత్, వర్తమానాలకు వారధిగా నిలిచే ఏకైక కళారూపం నాటకమని, ఒకప్పుడు సమాజాన్ని చైతన్యపరిచిన గొప్ప సాధనమని అలాంటి కళలను ప్రదర్శించే ప్రతిభ గల కళాకారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రంగస్థలంపై హావభావాలతో, సంభాషణా చాతుర్యంతో, పాత్రోచితమైన వేషధారణతో, నవరసాలకు ప్రతినిధులై ప్రేక్షకుల మనోఫలకంపై చిత్రించేవే నాటకంలోని పాత్రలు అని తెలిపిన మంత్రి దుర్గేష్ ఇటీవల తాను ప్రదర్శించిన బాలచంద్రుడి ఏకాపాత్రాభినయ పాత్రను గుర్తుచేసుకున్నారు.