ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan)పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నడ భాష గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని తేల్చి చెప్పింది.
ఇటీవల జరిగిన ‘థగ్ లైఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కూడా తీవ్రంగా స్పందించాయి. కర్ణాటకలో కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే ప్రకటన చేయడంతో కమల్ హాసన్ కోర్టుకెక్కారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
“మీరు కమల్‌హాసన్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీయలేరు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడింది. కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే అడిగారు. మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారు? మీరు ఏమైనా చరిత్రకారులా? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు?’’ అని హైకోర్టు ప్రశ్నించింది.