Thursday, December 11, 2025
Homeచిత్ర ప్రభRevolver Rita: రివాల్వ‌ర్ రీటా రివ్యూ - కీర్తి సురేష్ క్రైమ్ కామెడీ మూవీ హిట్టా?...

Revolver Rita: రివాల్వ‌ర్ రీటా రివ్యూ – కీర్తి సురేష్ క్రైమ్ కామెడీ మూవీ హిట్టా? ఫ‌ట్టా?

Revolver Rita: స్టార్ హీరోల‌తో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే ఆడపాద‌డ‌పా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది కీర్తి సురేష్. కొంత‌ గ్యాప్ త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌లో కీర్తి సురేష్ చేసిన మూవీ రివాల్వ‌ర్ రీటా. డార్క్ కామెడీ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీకి జేకే చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాధికా శ‌ర‌త్‌కుమార్‌, సునీల్‌, సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రివాల్వ‌ర్ రీటా మూవీ శుక్ర‌వారం (నేడు) తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్ మూవీతో కీర్తి సురేష్ హిట్టు కొట్టిందా? రివాల్వ‌ర్ రీటా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

- Advertisement -

రివాల్వ‌ర్ రీటా క‌థేమిటంటే?
రీటా (కీర్తి సురేష్‌) చిన్న‌త‌నంలోనే ఆమె తండ్రి చ‌నిపోతాడు. దాంతో కుటుంబ బాధ్య‌త‌లు రీటాపై ప‌డ‌తాయి. ఉద్యోగం చేస్తూ త‌ల్లి చెల్లెమ్మ (రాధికా శ‌ర‌త్‌కుమార్‌), ఇద్ద‌రు సిస్ట‌ర్స్ బాగోగుల‌ను చూసుకుంటుంది. పాండిచ్చేరిలోనే పెద్ద డాన్ అయిన డ్రాకులా పాండ్య‌న్ అలియాస్ పాండీ (సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్‌) డ్ర‌గ్స్ మ‌త్తులో అనుకోకుండా రీటా ఇంట్లోకి వ‌స్తాడు. అక్క‌డ జ‌రిగిన గొడ‌వ‌లో పాండీని చెల్ల‌మ్మ చంపేస్తుంది. ఈ మ‌ర్డ‌ర్ కేసు త‌మ‌పై ప‌డ‌కుండా పాండీ డెడ్‌బాడీని ఎవ‌రికి తెలియ‌కుండా మాయం చేయాల‌ని రీటా అండ్ ఫ్యామిలీ ప్లాన్ వేస్తారు. మ‌రోవైపు క‌నిపించ‌కుండా పోయిన తండ్రి పాండీ కోసం అత‌డి కొడుకు డ్రాకులా బాబీ (సునీల్‌) వెతుకుంటాడు. పాండీని చంపేందుకు మార్టిన్ అనే గ్యాంగ్ ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. పాండీని చంపి అత‌డి త‌ల‌ను తీసుకొచ్చిన వాళ్ల‌కు ఐదు కోట్లు ఇస్తాన‌ని రెడ్డి అనే రౌడీ ప్ర‌క‌టిస్తాడు. వీరంద‌రికి పాండీతో ఉన్న శ‌త్రుత్వం ఏమిటి? పాండీని చెల్ల‌మ్మ చంపేసిన విష‌యం బాబీకి తెలిసిందా? ఈ మ‌ర్డ‌ర్ కేసు నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి రీటా ఎలాంటి సాహ‌సానికి సిద్ధ‌ప‌డింది? అన్న‌దే రివాల్వ‌ర్ రీటా మూవీ క‌థ‌.

Also Read – Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – బాక్సాఫీస్ వ‌ద్ద రామ్ మాస్‌ ర్యాంపేజ్‌

ఓ పెద్ద క్రైమ్‌లో అనుకోకుండా చిక్కుకునే ఇన్నోసెంట్ హీరోహీరోయిన్లు… ఆ నేరం నుంచి త‌ప్పించుకునేందుకు వారు వేసే ఎత్తుల‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో చాలానే సినిమాలు వ‌చ్చాయి. డాక్ట‌ర్‌, కొల‌మావు కోకిల‌, మ‌త్తువ‌ద‌ల‌రా, దృశ్యం లాంటి సినిమాలు ఈ పాయింట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించాయి. రివాల్వ‌ర్ రీటా కూడా ఈ ఫార్మెట్‌లోనే సాగుతుంది.

ఈ సూప‌ర్ హిట్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది డైరెక్ట‌ర్ జేకే చంద్రు రివాల్వ‌ర్ రీటా క‌థ‌ను రాసుకున్న‌ట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి క్రైమ్ కామెడీ సినిమాల్లో స్టోరీలో కొత్త‌ద‌నం ఉండ‌దు. కానీ చెప్పే విధానంలో ద‌ర్శ‌కుడు ప్ర‌తిభ‌ను చూపించాలి. ఆడియెన్స్‌ను ఆద్యంతం ఎంగేజ్ చేసేలా స్క్రీన్‌ప్లేతో జిమ్మిక్కులు చేయాలి. అప్పుడే ఈ కాన్సెప్ట్‌లు వ‌ర్క‌వుట్ అవుతాయి. ఈ విష‌యంలో డైరెక్ట‌ర్ చంద్రు స‌గ‌మే స‌క్సెస్ అయ్యాడు. ఫ‌స్ట్ సీన్ నుంచి శుభం కార్డు వ‌ర‌కు సినిమాలో ఎక్క‌డ కొత్త‌ద‌నం అన్న‌ది కొంచెం కూడా క‌నిపించ‌దు.

లాజిక్‌లెస్ సీన్లు, క‌న్ఫ్యూజింగ్ కామెడీతో సినిమాను మొత్తం సాగ‌దీశారు. సినిమా ర‌న్‌టైమ్ రెండు గంట‌ల ఇర‌వై రెండు నిమిషాలే. కానీ ఓ ఐదు గంట‌ల సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. క్రైమ్ ఎలిమెంట్స్‌, ఇటు కామెడీ రెండు స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేదు.

క‌ర్మ ఫ‌లితాన్ని ఎప్ప‌టికైనా అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను రాసుకున్నారు. మూడు ఉప‌క‌థ‌ల‌తో ఒక‌దానికొక‌టి లింక్ చేస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించారు. రీటా ఫ్యామిలీతో పాటు డ్రాకులా ప్యాండ‌న్స్ క్రైమ్ వ‌ర‌ల్డ్‌ను ప‌రిచ‌యం చేస్తూ ఈ సినిమా మొద‌ల‌వుతుంది. అనుకోకుండా పాండ్య‌న్‌ను రీటా త‌ల్లి హ‌త్య చేసే సీన్‌తో ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

పాండ్య‌న్ డెడ్‌బాడీని మాయం చేయాల‌ని రీటా ఫ్యామిలీ… వారి ద‌గ్గ‌ర నుంచి ఆ మృత‌దేహాన్ని కొట్టేయాల‌ని చూసే మార్టిన్ గ్యాంగ్‌… తండ్రి కోసం బాబీ అన్వేష‌ణతో చివ‌రి వ‌ర‌కు క‌థ‌ను రివాల్వ‌ర్ రీటా క‌థ‌ను న‌డిపించారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయానికి రీటా అండ్ ఫ్యామిలీ ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్న‌ది క్లైమాక్స్‌లో రివీల‌య్యే ఎపిసోడ్ మాత్రం బాగుంది. పోలీస్ స్టేష‌న్ నుండి రీటా ఫ్యామిలీ త‌ప్పించుకునే సీన్‌, రెడ్డి ఫోన్ సీన్లు న‌వ్విస్తాయి. ట్విస్ట్‌లు బాగున్నా చాలా వ‌ర‌కు ప్రెడిక్ట‌బుల్‌గా ఉన్నాయి.

ఈ సినిమాకు కీర్తి సురేష్ బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌. రీటా పాత్రకు ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అనిపించేలా ఆమె న‌ట‌న సాగింది. కీర్తి సురేష్‌లోని యాక్ష‌న్ కోణాన్ని ఈ సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్‌. రాధికా శ‌ర‌త్‌కుమార్ ఇన్నోసెంట్ కామెడీతో కొన్ని చోట్ల న‌వ్వించింది. సునీల్ లుక్ కొత్త‌గా ఉంది. అత‌డితో పాటు సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్‌, రెడిన్ కింగ్‌స్లే ను డైరెక్ట‌ర్ స‌రిగ్గా వాడుకోలేదు. మ్యూజిక్‌, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ యావ‌రేజ్‌గా ఉన్నాయి.

రివాల్వ‌ర్ రీటా కీర్తి సురేష్ ఫ్యాన్స్‌ను మాత్ర‌మే మెప్పించే మూవీ. కొత్త‌ద‌నాన్ని ఆశించే వారిని మాత్రం డిజపాయింట్ చేస్తుంది.

రేటింగ్: 2/5

Also Read – Avatar 3: ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి వస్తోన్న అవతార్ 3..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News