సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madathapetti)సాంగ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఏ ఫంక్షన్ జరిగినా ఈ పాట వినపడాల్సిందే. అంతలా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో యూట్యూబ్ రికార్డులు బద్ధలయ్యాయి. ఏకంగా 52కోట్లకు పైగా వ్యూస్‌తో అదరగొట్టింది. తాజాగా యూట్యూబ్ సంస్థ ఏయే దేశాల నుంచి ఏ పాట టాప్‌లో ఉందో ప్రకటించింది. ఇండియా నుంచి ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ మాత్రమే టాప్‌లో ఉందని పేర్కొంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఈ ఏడాది ఎన్నో హిట్ పాటలు విడుదలైనా.. వాటన్నింటిని వెనక్కు నెట్టి ‘కుర్చీ మడతపెట్టి’ పాట టాప్‌లో నిలవడంపై సంగీత దర్శకుడు థమన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘గుంటూరు కారం’ టీమ్ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. తమ పాటను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఈ పాటలో మహేశ్, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రీ కృష్ణ, సాహితి ఆలపించారు. ఇక కేండ్రిక్ లామర్ ఆలపించిన ‘నాట్ లైక్ అజ్’ అమెరికాలో టాప్‌లో నిలవగా.. కెనడా, యూకేలో ‘బ్యూటిఫుల్ థింగ్స్’, దక్షిణ కొరియాలో టీబీహెచ్ పాటలను ప్రేక్షకులు ఎక్కువగా విన్నట్లు తెలిపింది.