టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun)-లావణ్యల మధ్య వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. కోకాపేటలోని రాజ్ తరుణ్ కొన్న విల్లాలోకి ఆయన తల్లిదండ్రులు వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న లావణ్య..వారిని ఇంట్లో నుంచి గెంటివేసింది. దీంతో ఆ విల్లా ముందు కూర్చుని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజ్ తరుణ్ కష్టపడి సినిమాలు చేసిన డబ్బులతో ఈ ఇల్లు కొన్నాడని చెబుతున్నారు. ఇందులో లావణ్యకు ఎలాంటి హక్కులు లేవు అని వాపోతున్నారు. మరోవైపు ఆ ఇల్లు కొనడానికి తాను కోటి రూపాయలకు ఇచ్చానంటూ లావణ్య తండ్రి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు.
రాజ్-లావణ్య మూడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారని.. ఆ తర్వాత విడిపోయారని తెలిపారు. తమకు ఆరోగ్య సమస్యలు వచ్చి ట్రీట్ మెంట్ కోసం బయటకు వెళ్లామన్నారు. ఇప్పుడు ఇంటికి వస్తే లావణ్య గెంటేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు వస్తున్నానంటూ రాజ్ తరుణ్‌కు తెలియదని.. దయచేసి తమకు న్యాయం చేయండని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే విల్లాలో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పావని విల్లాస్ అసోసియేషన్ రాజ్ తరుణ్‌కు లేఖ రాసింది. ఇక ఈ వివాదంపై ఇప్పటి వరకు రాజ్ తరుణ్ స్పందించలేదు. కాగా లావణ్య తీరు తొలి నుంచి వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రాజ్ తనను మోసం చేశాడంటూ పోలీస్ కేసు పెట్టడం.. తర్వాత డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడం చర్చనీయాంశంగా మారింది.